Singareni Coal Blocks Auction : సింగరేణికి మళ్లీ ముప్పు పొంచి ఉంది. కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత బొగ్గు గనుల వేలానికి నిర్ణయించింది. మొత్తం 99 బొగ్గు బ్లాకుల వేలానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని బొగ్గు గనులకు వేలం వేస్తామని ప్రకటించింది. అందులో ఏయే గనులున్నాయన్నది తేలకపోయినా పై రాష్ట్రాలోని గనులకు మాత్రం వేలం ముప్పుపొంచి ఉంది.
Singareni Coal Mines Auction : ఇప్పటికే సింగరేణికి చెందిన నాలుగు బ్లాకులను వేలం నుంచి ఉపసంహరించుకోవాలని కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో మూడింటికి ఒక్క టెండరూ రాలేదు. ఒక గనికి ఒకే టెండరు దాఖలైంది. ఈ ముప్పునుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న సింగరేణికి కేంద్ర తాజా నిర్ణయంతో ఆందోళన మొదలైంది. గనుల వేలాన్ని విరమించుకోవాలని సింగరేణి కార్మిక సంఘాలు ఇటీవల 3 రోజుల సమ్మె నిర్వహించగా కేంద్రం స్పందిస్తుందని భావించారు. బీఎంఎస్ నాయకులు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి సింగరేణి బ్లాకులను వేలం నుంచి మినహాయించాలని కోరారు. అందులోంచి బయటపడకముందే మళ్లీ నాలుగో విడత బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్రం సిద్ధమవుతుండటం సింగరేణిలో గుబులు రేపుతోంది.
అప్రమత్తం కాకపోతే కష్టమే..
Stop Coal Blocks Auction : కేంద్ర సర్కారు విధానపరమైన నిర్ణయాలతో బొగ్గు గనుల వేలానికి సిద్ధమవుతున్న క్రమంలో సింగరేణి అప్రమత్తం కాకపోతే దాని గనులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కోయగూడెం బ్లాక్-3, శ్రావణ్‌పల్లి బ్లాక్, సత్తుపల్లి బ్లాక్-3, కెకె-6 గనులకు టెండర్లు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి ఏయే గనులకు వేలం ప్రకటన ఇస్తుందో తెలియని పరిస్థితి.
Telangana on Singareni Blocks Auction :సింగరేణి వద్ద ప్రస్తుతం 12 గనులకు సంబంధించిన నివేదికలున్నాయి. డ్రిల్లింగ్ పనులు చేపట్టి ప్రాజెక్టు నివేదికలు తయారు చేసుకొని అనుమతుల కోసం ఎదురుచూస్తున్న గుండాల, రాంపూర్, తాడిచెర్ల బ్లాకు-2, పెద్దాపూర్, పునుకులచిలక, లింగాల, వెంకటాపూర్, పెనగడప, చండ్రుగొండ, కేటీకే-5 లాంగ్‌వాల్ గనులపై సంస్థ ఆశలు పెంచుకుంది. ఇందులో కేంద్రం వేటికి వేలం ప్రకటిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తమ ఇబ్బందిని దాని ముందుంచడంతో అక్కడి బొగ్గు గనులను వేలం నుంచి మినహాయించారు. సింగరేణి బొగ్గుబ్లాకుల విషయంలోనూ అదే పంథా అనుసరించకుంటే మళ్లీ వేలం ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : Singareni Privatization : సింగరేణి నెత్తిన 'వేలం' కుంపటి