Power Cuts In AP: పగలూ లేదు.. రాత్రీ లేదు.. ఎప్పుడు పడితే అప్పుడు ఎడాపెడా కోతలు. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు దోమల మోత. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించాల్సి వస్తోంది. గతంలో 2014 అక్టోబరు వరకు మాత్రమే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేవి. తర్వాత మళ్లీ ఇప్పుడే కోతలు మొదలయ్యాయి. దక్షిణ భారతదేశంలో ఏపీ కాక.. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో గృహావసరాలు.. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉంది.
తెలంగాణ డిమాండు 250-260 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మధ్య ఉన్నా, అవసరమైన విద్యుత్‌ను ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేసి సమస్య లేకుండా సరఫరా చేస్తున్నారు. కానీ ఏపీలో విద్యుత్ ఉత్పత్తి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగానే ఉన్నా.. కావల్సిన వనరులున్నా.. ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడమే ప్రస్తుత సమస్యకు కారణమైంది. దీనివల్ల మిగిలిన రాష్ట్రాలు కాంతులతో ధగధగలాడుతుంటే.. అక్కడి ప్రజలు చీకట్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వమా...అధికారులా..?:
దక్షిణాదిలో ఇక్కడ ఒక్కచోట కోతలు: దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళతో పాటు చిన్న రాష్ట్రం పుదుచ్చేరితో కలిపి గురువారం విద్యుత్ డిమాండు సుమారు 1,221 ఎంయూలు. మొత్తం లోటు 28.71 ఎంయూలు కాగా, అందులో 23.53 ఎంయూలు ఏపీదే! గత వారం రోజుల్లోనూ విద్యుత్ కొరత అక్కడే ఎక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ముందస్తుగా పరిస్థితిని అంచనా వేసి అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకున్నాయి. ఏపీ విద్యుత్ సంస్థలు మాత్రం ప్రజలను చీకట్లకు వదిలేశాయి.
పుదుచ్చేరి కంటే.. ఏపీలో దారుణం..: తమిళనాడులో విద్యుత్ డిమాండు అత్యంత ఎక్కువగా 365.35 ఎంయూల వరకు ఉంది. పీపీఏల ద్వారా 230 ఎంయూలు, అణువిద్యుత్ 46 ఎంయూలు తీసుకుని నిరంతరం సరఫరా చేస్తున్నాయి.
- తెలంగాణలో విద్యుత్ డిమాండు 265 ఎంయూలకు చేరింది. ఉత్పత్తి 111.58 ఎంయూలే. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి రోజుకు 50 ఎంయూల వరకు తీసుకుంటోంది. డిమాండు సర్దుబాటు కోసం రోజుకు 90 ఎంయూలను ఎక్స్ఛేంజీల నుంచి కొంటున్నారు. రూ.70-100 కోట్ల మధ్య విద్యుత్ కొనుగోలుకు ఖర్చుచేసి అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తున్నారు.
- కర్ణాటకలో డిమాండు 271.32 ఎంయూలకు చేరింది. ఉత్పత్తి 182.21 ఎంయూ మాత్రమే. 90 ఎంయూలు కొనేలా ముందే ప్రణాళిక రూపొందించుకుంది.
- కేరళలోను 50 ఎంయూలను కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, బహిరంగ మార్కెట్‌లో కొని సరఫరా చేస్తున్నాయి. పుదుచ్చేరిలో విద్యుత్ డిమాండు 9.32 ఎంయూలు. రాష్ట్రంలో ఒక్క ప్లాంటు కూడా లేదు. విద్యుత్ మొత్తం బయట కొనాల్సిందే. అలాగే తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తోంది. ఏపీలో వనరులన్నీ ఉన్నా ప్రజలకు కోతల బాధ తప్పని పరిస్థితిని విద్యుత్ సంస్థలు కల్పించాయి.
కొనుగోళ్లలో తడబాటు..: ఆంధ్రప్రదేశ్‌లో డిమాండు 235 ఎంయూలు. థర్మల్ విద్యుత్ 89.83 ఎంయూలు (దక్షిణాది రాష్ట్రాల్లో మనకే ఎక్కువ), జల విద్యుత్ 7.78 ఎంయూలు, ఇతర వనరుల నుంచి వచ్చే విద్యుత్ 3.61 ఎంయూలు, పునరుత్పాదక విద్యుత్ 27 ఎంయూలు వస్తోంది. అన్ని వనరుల నుంచి ప్రస్తుతం 130 ఎంయూలు, కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి 40-50 ఎంయూలు అందుతున్నా.. మిగిలిన లోటును సమకూర్చుకోవటంలో విద్యుత్ సంస్థలు విఫలమయ్యాయి. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో భారీగా విద్యుత్తును సేకరించి.. ప్రజలకు, పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇవ్వగలుగుతున్నారు. ఏపీలో అధికారికంగానే కోతలు విధిస్తున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో ఎక్కువగా నేరాలు చేస్తోంది వీళ్లే..