గతేడాది మార్చ్‌లో స్థానికసంస్థల ఎన్నికల ప్రక్రియలో ఉల్లంఘనల్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని, హింసను నియంత్రించలేకపోయారంటూ.. పలువురు ఉన్నతాధికారులను ఏపీ ఎస్ఈసీ విధుల నుంచి తొలగించింది. వీరిలో చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలు ఉన్నారు. గతంలో పలమనేరు డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం తిరుపతి అదనపు ఎస్పీగా వ్యవహరిస్తున్న అరిఫుల్లాను ఎన్నికల విధులకు దూరం పెట్టింది.
పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసమే
రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసమే వీరిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వేరేవారిని నియమించేందుకు వీలుగా ప్యానల్ జాబితాలు పంపించాలంటూ సీఎస్, డీజీపీలను ఎన్నికల సంఘం ఆదేశించింది. వీరందరిపై చర్యలకు గతేడాది మార్చ్‌లోనే లేఖ రాశారు. కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల వాయిదా, కోడ్ అమలు నిలిపివేతతో.... ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోలేదు.
తాజాగా ఉత్తర్వులు
ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అవరోధాలన్నీ తొలగిపోవటం వల్ల కళంకిత అధికారులను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఈ నెల 8న సీఎస్‌కు మరోమారు తాను లేఖ రాసినట్లు రమేశ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల వారందరినీ విధుల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చారు. గతేడాది జారీ చేసిన ఆదేశాల్లో... అప్పటి గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావును సైతం విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. సాధారణ బదిలీల్లో ఆయన రైల్వే ఎస్పీగా వెళ్లిపోవటంతో ప్రస్తుత ఆదేశాల్లో ఆయన అంశాన్ని ప్రస్తావించలేదు.
వారే వ్యాక్సినేషన్లో క్రియాశీలకం
కళంకిత అధికారుల తొలగింపుపై ఈ నెల 21న మరోసారి సీఎస్‌కు లేఖ రాశానన్న నిమ్మగడ్డ.. ప్రభుత్వం మళ్లీ అదే తరహా అవిధేయతను ప్రదర్శించిందన్నారు. అలాంటి అధికారులను ఎన్నికల విధుల్లో కొనసాగిస్తే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని... వారి పక్షపాత ధోరణి, ప్రవర్తన.. ఎన్నికల నిర్వహణపైనా ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం అభిప్రాయాల్ని మార్చుకునే పరిస్థితి లేనందున.. ఆర్టికల్243(కే), ఆర్టికల్324 ప్రకారం.. సంబంధిత కళంకిత అధికారులను తొలగిస్తున్నానంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అధికారులను తప్పించాలన్న ఎస్ఈసీ ఆదేశాలను పాటించలేమని.. నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. కళంకిత అధికారులుగా మీరు చెప్తున్నవారు.. వ్యాక్సినేషన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేం..
పోలింగ్ సిబ్బందికి కరోనా టీకా వేయడం, వారిని ఎన్నికల విధుల్లో నియమించడం ఒకేసారి సాధ్యం కావని... ఆదిత్యనాథ్ దాస్ తన లేఖలో స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి రెండు డోసుల టీకా వేసి... వారిలో పూర్తిస్థాయిలో రోగనిరోధక శక్తి పెంపొందేవరకు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. సిబ్బంది మొత్తానికి తొలి డోస్ కరోనా టీకా వేసిన 60 రోజుల తర్వాతే... ఎన్నికలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్ రూపొందించాలని ఎస్ఈసీని కోరారు. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా ఎన్నికల నిర్వహణపై ముందుకెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్‌కు అనువైన షెడ్యూల్ రూపొందించుకోవచ్చని వివరించారు.
అనువైన వాతావరణం లేదు
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఎస్ఈసీ తనకు రాసిన లేఖలోని అంశాలకు సీఎస్ బదులిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదన్నారు. ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎస్ఈసీ ఆదేశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణపై సన్నద్ధతను తెలుసుకునేందుకు షెడ్యూల్ ప్రకటించకముందే ప్రభుత్వంతో అర్థవంతమైన సంప్రదింపులు జరపాల్సిందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు.. ఎన్నికల నిర్వహణతో పాటు టీకాల కార్యక్రమానికి రవాణా, తదితర ఏర్పాట్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఇందుకు త్వరలోనే తేదీ ఖరారు చేసి తెలియచేస్తామని... రెండు కార్యక్రమాలనూ సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ పైనా ఉందన్నారు.
అది కేంద్ర మార్గదర్శకాల్ని ఉల్లంఘించడమే
ఎన్నికల సిబ్బందికి తొలి డోస్ టీకా వేసిన 4 వారాలకు రెండో డోస్ వేస్తే.. మరో 4 వారాలకు వారిలో రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పిందని సీఎస్ తన లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే వ్యాక్సినేషన్‌ను వాయిదా వేయాలని.. అది కేంద్ర మార్గదర్శకాల్ని ఉల్లంఘించడమేనన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడుతుందని.. అలాగే సిబ్బందిని ఎన్నికల విధులకు పంపేముందు టీకాలు వేయడంలో తమకు ఎస్ఈసీ పూర్తిగా సహకరిస్తుందని భావిస్తున్నామన్నారు.ప్రజారోగ్యం, ప్రజాప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల షెడ్యూల్ సవరించాలన్న తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే..?