ఎన్నికలనగానే గల్లీల్లో మైకుల మోతలు వినిపిస్తూ ఉంటాయి. ఆయా పార్టీల రంగులు, జెండాలు, అభ్యర్థుల హోర్డింగులతో ప్రచార రథాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికీ వెళ్లే సమయం లేక... కనీసం ప్రచార రథాల ద్వారా అయినా తమ ఎన్నికల ప్రచారాన్ని చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఏ ఎన్నికలైనా హడావుడి చేస్తూ అభ్యర్థుల విజయానికి తమ వంతు పాత్ర పోషిస్తున్న ప్రచార రథాలు... ఇప్పుడు బల్దియా పోరులోనూ చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్నికల ప్రచారాల్లో ముఖ్య పాత్ర పోషించే ప్రచార రథాలు తయారు చేసే కార్మికులు మాత్రం ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ప్రచార రథాల తయారీపై ఫ్లెక్సీల ప్రభావం కూడా ఉందని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల సమయాల్లో నెల రోజుల పాటు ఉండే ఉపాధి... ప్రస్తుతం నాలుగైదు రోజులకు మాత్రమే పరిమితమైందని కార్మికులు వాపోతున్నారు.
హైదరాబాద్లో ప్రచార రథాల తయారీకి పేరుగాంచిన చిన్న సినిమా ఆర్ట్స్ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ సుదీర్ఘకాలంగా ఈ ప్రచార రథాలను తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు రెండు వేల మందితో ప్రచార రథాలను తయారుచేసే ఈ సంస్థ... ప్రస్తుతం 200 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తోంది. ఎన్టీఆర్ హయం నుంచి ప్రచార రథాలను తయారు చేస్తూ... ముందుకు సాగుతోన్న తమకు ప్రస్తుతం ఆదరణ అంతంతమాత్రంగానే ఉందని ఆ సంస్థ అధినేత చందర్రావు తెలిపారు.