గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో చెరువుల పరిరక్షణ, నిర్వహణ అధ్వానంగా మారిందని 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదిక వెల్లడించింది.
ఘన వ్యర్థాల కుమ్మరింత..
2013-18 ఏళ్ల మధ్యకాలంలో చెరువుల సర్వే కోసం రూ.12.62 కోట్లు ఖర్చు చేయడం తప్ప చెరువుల సంరక్షణకు హెచ్ఎండీఏ ఎలాంటి వ్యయం చేయలేదని పేర్కొంది. నగరంలో పట్టణీకరణ పెరగడం, చెరువుల సంఖ్య వాటి విస్తీర్ణంలో స్థిరమైన తగ్గుదలకి దారితీసిందని వెల్లడించింది. చెరువుల్లో ఘన వ్యర్థాల కుమ్మరింత వల్ల వాటి భౌతిక, రసాయనిక స్వభావంలో తీవ్రమైన మార్పులు వచ్చాయని పేర్కొంది.
ఏడు జిల్లాల్లో విస్తరించిన హైదరాబాద్ మహానగర ప్రాంతంలో 2018 జూన్ నాటికి 3,132 చెరువులు ఉన్నాయని.. చెరువుల పరిరక్షణ, సంరక్షణపై... రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఆడిట్ నిర్వహించారు. చెరువుల పరిరక్షణలో సమన్వయం కోసం రాష్ట్రంలోని సంస్థాగత నిర్మాణాలను ఆడిట్లో సమీక్షించారు.
సమన్వయ లోపం..
2018 సెప్టెంబరు నాటికి రూ.112.62 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, చెరువుల సర్వే, వాటిని నోటిఫై చేసే పని ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది. 2018 జూన్ నాటికి కేవలం అయిదు శాతం అనగా 165 చెరువులకే నోటిఫికేషన్లు జారీ అయ్యాయని పేర్కొంది. నోటిఫికేషన్లు జారీ అయినా.. చెరువు పూర్తి మట్ట ప్రాంతం, బఫర్ జోన్కు సంబంధించిన సర్వే నంబర్లు గెజిట్లో ప్రకటించలేదని తెలిపింది. 3,132 చెరువుల గణనకు సంబంధించిన జాబితా సమగ్రంగా లేదని మొట్టికాయలు వేసింది. అందులో 146 చెరువులను వదిలివేశారని.. సర్వే ఫలితాలను.. సాగునీటి , రెవెన్యూ శాఖల రికార్డులతో సమన్వయం చేయడంలో జరిగిన జాప్యం, తుది నోటిఫికేషన్లు జారీ ఆలస్యానికి దారి తీసిందని వెల్లడించింది.
చెరువుల పరిరక్షణ సమితి విఫలం..
సాగునీటి శాఖ వద్ద చరిత్రాత్మక సమాచార పత్రం ఉన్న చెరువులకు తుది నోటిఫికేషన్లు జారీచేసిన సందర్భాల్లో.. ఆ చెరువుల విస్తీర్ణం కంటే 120.895 ఎకరాల మేర తక్కువగా ప్రకటించారని గుర్తించింది. చెరువుల పరిరక్షణ సమితి.. వివిధ భాగస్వామ్య ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించలేకపోయిందని పేర్కొంది. తన నిర్ణయాలు అమలు జరిగేలా చూడటంలో విఫలమవ్వడం వల్ల చెరువుల కాలుష్యం, క్షీణత కొనసాగడానికి దారి తీసిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 258 చెరువుల సంరక్షణ, సుందరీకరణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు కాగ్ పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఆమోదంగానీ, నిధుల విడుదల కానందున కార్యాచరణ ప్రణాళికను అమలుచేయలేక పోయినట్లు వివరించింది.
సమగ్ర అధ్యయనం చేయలే...
హెచ్ఎండీఏకు.. రూ. 120 కోట్లతో 20 చెరువులను అభివృద్ధి, సుందరీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో 11 చెరువులకు ఎలాంటి సాధ్యాసాధ్యాల నివేదికలు లేవని, సమగ్ర అధ్యయనం చేయలేదని.. కేవలం రెండు చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయని పేర్కొంది.
మార్గదర్శకాలు పాటించలేదు..
2014-18 మధ్య చెరువుల విషయంలో జీహెచ్ఎంసీ రూ. 287.33 కోట్ల బడ్జెట్ కేటాయించినా.. కేవలం రూ.42 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాగ్ నివేదిక పేర్కొంది. 2018-19లో మిషన్ కాకతీయ కింద చెరువుల అభివృద్ధి, పునరుద్ధరణకు రూ.282.63 కోట్లు పరిపాలన అనుమతులు జారీచేసింది. అయితే ఈ విషయంలో మిషన్ కాకతీయ మార్గదర్శకాలు పాటించకుండా, గొలుసుకట్టు చెరువుల ప్రాధాన్యత తెలుసుకోకుండా.. చెరువులను ఎంపిక చేశారని ఆక్షేపించింది.
నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అక్వాటిక్ ఎకో సిస్టం పథకం ప్రకారం 19 చెరువులకు రూ.310.60 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసినా అస్పష్ట, తప్పుడు అంచనాల వల్ల 2018 ఆగస్టు నాటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదని కాగ్ తన నివేదికలో చెప్పింది.