కారు కదిలితేనే కుటుంబ పోషణ గడిచేది. క్యాబ్ చక్రం తిరిగితేనే.. వారి జీవనచక్రం నడిచేది. రోజంతా తిరిగిన రైడ్లతో వచ్చిన సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దె, క్యాబ్ కిస్తీలు.. ఇవన్నీ ఆ నాలుగు చక్రాలపైనే ఆధారపడి ఉన్నాయి. మొన్నటిదాకా కరోనా సృష్టించిన కకావికలం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న క్యాబ్ డ్రైవర్ల(Cab Drivers problems)కు.. పెరుగుతున్న ఇంధన ధరలు గుండెదడ పుట్టిస్తున్నాయి.
రూ.65 నుంచి రూ.102కు
లీటర్‌కు రూ.65 ఉన్న డీజిల్ కాస్త ఇప్పుడు రూ.102కు చేరుకుంది. పెరిగిన ఇంధన ధరలతో తాము ఆర్థికంగా చితికిపోయామని క్యాబ్ డ్రైవర్లు(Cab Drivers problems) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధర పెరిగినా.. క్యాబ్ రైడ్ ధర మాత్రం పెంచలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కేంద్ర సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు.
అంతంతమాత్రమే గిరాకీ..
రాష్ట్రంలో 4.75 లక్షల పైచిలుకు క్యాబ్‌లు ఉన్నాయి. కేవలం గ్రేటర్ పరిధిలో 1.50 లక్షల క్యాబ్‌లు వివిధ ఐటీ సంస్థల్లో, ఓలా, ఊబర్ సంస్థల్లో నడుపుతున్నారు. కరోనా వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండటం వల్ల ఐటీ సంస్థల్లో క్యాబ్ నడిపే(Cab Drivers problems) వారి పొట్టగడవడం కష్టంగా మారింది. మహమ్మారి సృష్టించిన విలయతాండవం నుంచి కోలుకుంటున్న సమయంలో వరుసగా పెరుగుతున్న డీజిల్ ధరలతో గిరాకీలు అంతంత మాత్రమే వస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు(Cab Drivers problems) చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల క్యాబ్‌ల కిస్తీలు సరైన సమయంలో కట్టలేకపోతున్నామని వాపోతున్నారు.
గాడి తప్పిన బతుకు..
"క్యాబ్‌లు నడపడం ద్వారా వచ్చే సంపాదనతో జీవించలేకపోతున్నాం. హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు కట్టలేక మాలో కొందరు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. అక్కడ వ్యవసాయ, ఉపాధి హామీ పనులు చేసుకుని బతుకొచ్చని పోతున్నారు. ఇప్పటికే పదిశాతానికి పైగా వారి ఊళ్లకు పయనమయ్యారు. మరికొంత మంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఊళ్లకు వెళ్లలేక.. ఇక్కడే క్యాబ్ నడపలేక కొందరు.. డెలివరీ బాయ్స్‌గా మారారు. లోన్లతో క్యాబ్‌లు కొన్నాం. ఇప్పుడు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. ఫైనాన్స్ వాళ్ల నుంచి రోజు ఫోన్లు వస్తున్నాయి. ఏ క్షణంలో వచ్చి కారు తీసుకెళ్తారేమోనని భయంతో బతుకుతున్నాం."
- క్యాబ్ డ్రైవర్లు
బతుకు చిత్రం మారేనా..
ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తే తమ పరిస్థితి కాస్త మెరుగవుతుందని పలువురు క్యాబ్ డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలకు కాస్త బ్రేక్ పడితే.. తమ బతుకు గాడిన పడుతుందని భావిస్తున్నారు. కానీ ఆ పరిస్థితులు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదని వాపోతున్నారు. కేంద్ర సర్కార్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.