కొత్త సంవత్సర స్వాగత వేడుకల్లో ఏపీలో మద్యం ఏరులై పారింది. డిసెంబరు 31న రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల్లో రూ.116కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఈ ఒక్కరోజే లక్ష కేసులకు పైగా మద్యాన్ని, 46 వేల కేసుల బీర్లు విక్రయించారు. డిసెంబరు 30, 31 రెండు రోజుల్లో కలిపి విక్రయాలు రూ. 199.52 కోట్లు దాటాయి. సాధారణ రోజుల్లో సగటున రూ. 70 నుంచి 75 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతోంది.
గురువారం అంతకంటే 65.71 శాతం అధికంగా విక్రయాలు జరిగాయి. 2019 డిసెంబర్ అమ్మకాలతో పోలిస్తే ఈ సారి అమ్ముడైన సరకు పరిమాణం తగ్గినప్పటికీ మద్యం ధరలు పెరగటంతో ఆదాయం సైతం పెరిగింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా రూ. 10.78కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. గుంటూరు జిల్లాలో రూ.10.56 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 10.11 కోట్ల విలువైన సరుకు విక్రయించారు. అనంతపురం జిల్లాలో అతి తక్కువగా రూ. 2.98 కోట్ల విక్రయాలు జరిగాయి.