ఏపీకి చెందిన తెదేపా నేత బుద్దా వెంకన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశముంది.
సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఆ క్యాసినోలో డీజీపీ వాటా ఉన్నందునే మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవడం లేదంటూ బుద్దా వెంకన్న ఈ ఉదయం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు ఇంటివైపు వస్తే కొడాలి నానిని చంపడానికైనా.. తాను చావడానికైనా సిద్ధమని బుద్దా వ్యాఖ్యానించారు.
ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సరైన సమాధానం రాకపోతే బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసే అవకాశముంది. దీనిలో భాగంగా ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు బుద్దా వెంకన్నను అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.