BSc Nursing with EAMCET score : రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను ఇకపై ఎంసెట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది (2022-23) ప్రవేశాలను ఎంసెట్ ర్యాంకులతో భర్తీ చేయాలని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపిన వెంటనే వర్సిటీ అధికారులు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి లేఖ రాసి ఎంసెట్‌లో చేర్చనున్నారు. మరికొద్ది రోజుల్లో ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నందున వారు దీనిపై దృష్టి సారించారు. త్వరలోనే అనుమతి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లను విశ్వవిద్యాలయం భర్తీ చేస్తోంది.
ఏదో ఒక ప్రవేశ పరీక్ష తప్పనిసరి
BSc Nursing with EAMCET : ఏదో ఒక ప్రవేశ పరీక్ష ఆధారంగానే బీఎస్‌సీ నర్సింగ్ సీట్లను భర్తీ చేయాలని భారతీయ నర్సింగ్ మండలి(ఐఎన్‌సీ) అన్ని రాష్ట్రాలను గత ఏడాదే ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2021-22) నుంచి నీట్ స్కోర్ ఆధారంగానూ నర్సింగ్ సీట్లు కేటాయించవచ్చని సూచించింది. అయితే అప్పటికే నీట్, ఎంసెట్ నోటిఫికేషన్లు వెలువడినందున ఇప్పటికిప్పుడు ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ల భర్తీ కష్టమని, ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని, వచ్చే ఏడాది( 2022-23) నుంచి అమలు చేస్తామని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం భారతీయ నర్సింగ్ కౌన్సిల్‌ను పోయిన ఏడాది కోరింది. అందుకు అంగీకరించడంతో ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు జరిపారు. ఇక వచ్చే ఏడాదికి ఏదో ఒక ప్రవేశ పరీక్ష ర్యాంకు ఆధారంగానే సీట్లు భర్తీ చేయాలి. రాష్ట్రంలో 87 నర్సింగ్ కళాశాలలు ఉండగా సుమారు 5 వేల వరకు సీట్లున్నాయి.
నీట్‌తో పోలిస్తే ఎంసెట్ సులభమని..
BSc Nursing with EAMCET in Telangana : ప్రవేశ పరీక్ష తప్పనిసరి కావడంతో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలని కాళోజీ వర్సిటీ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. నీట్ అయితే అర్హత సాధించడం సగటు విద్యార్థికి కష్టమని, ఎంసెట్ అయితే నెగెటివ్ మార్కులు లేకపోవడం, నీట్‌తో పోల్చుకుంటే కొంత సులభంగా ఉంటుందని వర్సిటీ భావిస్తోంది. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలో వచ్చిన ర్యాంకును బీఎస్‌సీ నర్సింగ్ సీట్ల భర్తీకి పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో మాదిరిగానే ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేయాలని, నర్సింగ్‌లో చేరే విద్యార్థులు ఎంసెట్‌లో అర్హత సాధించలేరని నర్సింగ్ కళాశాలల యజమాన్యాలు కాళోజీ వర్సిటీ అధికారులకు ఇటీవల విన్నవించినట్లు సమాచారం. ఏదో ఒక ప్రవేశ పరీక్ష తప్పనిసరి చేస్తూ ఎన్‌సీఐ ఉత్తర్వులు జారీ చేసినందున అందుకు విరుద్ధంగా ప్రవేశాలు జరిపితే విద్యార్థుల సర్టిఫికెట్లకు విలువ ఉండదని, విద్యార్థులు నష్టపోతారని వర్సిటీ ఉపకులపతి కరుణాకర్‌రెడ్డి వారికి నచ్చజెప్పినట్లు తెలిసింది.