CM Revanth Reddy on Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్మా (ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) చట్టం కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతుల పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే సహించేంది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైతులను గందరగోళానికి గురి చేయటం, వేధించటం వంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లపై అంతగా దృష్టి సారించకపోవడం, కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు లేకపోవడం వల్ల అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనల సాకుతో నిర్వాహకులు, మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు ధాన్యం తరలించేందుకు కావల్సిన గోనె సంచుల కొరత, తూకం ఆలస్యంగా వేయడం, ధాన్యం తీసుకెళ్లేందుకు వాహనాలు లేకపోవడం వంటి కారణాలు రైతులకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. దీనికి అప్పుడప్పుడు కురిసే అకాల వర్షాలతో కూడా రైతులకు నష్టం తప్పడం లేదు.
దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వెంట వెంటనే జరగాలని, ఎక్కడైనా జాప్యం జరిగితే వ్యాపారులతో బాధ్యత అని హెచ్చరించారు.
అన్నదాతలతో మాట్లాడిన నేతలు - ధాన్యం తడిసి నష్టపోతున్నామని ఫైర్ - Paddy Purchasing Centers Issue