తెలంగాణలో బోనాల సంబురం షురూ అయింది. ప్రతిఏటా అంగరంగ వైభవంగా జరుపుకునే ఆషాఢమాస బోనాలు గోల్కొండ జగదాంబికా ఆలయం నుంచి మొదలయ్యాయి. జగదాంబికా ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల సందర్భంగా.. ఆలయాన్ని పూలు, విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
గోల్కొండ నుంచి షురూ..
ఆనవాయితీ ప్రకారం గోల్కొండ ఆలయంలో బోనాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే అయినా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. గోల్కొండ బోనాలకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 600 మందికిపైగా సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి వచ్చే నెల 8 తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
ఊరేగింపు..
ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలు ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
9 రకాల పూజలు
బోనాల పండుగలో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గోల్కొండ బోనాలు ముగిసిన వారం తర్వాత లష్కర్ బోనాల పండుగ జరగనుంది.