బోనాల పండుగ(Bonalu)కు భాగ్యనగరం ముస్తాబవుతోంది. కరోనాతో గతేడాది బోనాలు నిర్వహించుకోలేకపోయాం. ఈ ఏడు రెట్టింపు ఉత్సాహంతో.. అంగరంగవైభవంగా బోనాల పండుగ నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. ఆషాఢం తొలి ఆదివారమైన ఈనెల 11న గోల్కొండ కోటలో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. రాష్ట్ర పండుగగా జరిగే ఈ వేడుకలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, గోల్కొండ జగదాంబిక, బల్కంపేట ఎల్లమ్మ, పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. గతేడాది కరోనా నిబంధనలతో సంప్రదాయ ప్రకారం జరిగిన ఉత్సవాలను ఈ ఏడాది అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గోల్కొండ కోటలో ప్రారంభం..
సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కుతుబ్‌షాహీ రాజైన తానీషా హయాంలో మంత్రులైన అక్కన్న, మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించారు. జులై 11న మొదటి పూజ ప్రారంభం కానుంది. లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు.. ఆలయం వరకూ సాగుతుంది. ఈ సందర్భంగా మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బడాబజార్‌లోని పూజారి అనంతచారి ఇంట్లో అమ్మవారి విగ్రహాలకు పూజలు నిర్వహించి కోటపైని ఆలయానికి తీసుకొస్తారు.
జులై 11న రథం, తొట్టెల ఊరేగింపు, మొదటి పూజ
22న నాల్గో పూజ, చండీహోమం
29న ఆరో పూజ, శాకాంబరి పూజ
ఆగస్టు 8న తొమ్మిదో పూజతోపాటు అమ్మవారి సమారోహన కుంబార్తి వేడుకలు
ఘటోత్సవం.. రంగం
రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో ఈనెల 11న ఘటోత్సవం నిర్వహించనున్నారు. ఇక్కడ ఉత్సవాలు 15 రోజుల పాటు కొనసాగుతాయి. ఘటోత్సవం నుంచి బోనాల సమర్పించే ముందు రోజు వరకు అమ్మవారు సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘటం ఊరేగింపు ద్వారా దర్శనమిస్తారు. నైవేద్యం సమర్పించడం, పోతరాజుల నృత్యాలు, తొట్టెలు, ఫలహారం బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయ పుర వీధుల్లో ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు కనులపండువగా జరగనున్నాయి.
జులై 11న ఘటోత్సవం
25న బోనాలు
26న రంగం
వైభవం.. ఎల్లమ్మ కల్యాణం
బోనాల(Bonalu) ఉత్సవాల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ తంతుకు ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని భక్తుల విశ్వాసం. కరోనా నిబంధనల నడుమ గతేడాది ఆలయంలోనే జరగగా, ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్నారు. సర్వాంగ సుందర కల్యాణ వేదిక, ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం, వేలాది భక్తజనంతో కిక్కిరిసే రోడ్లు, శివసత్తుల నృత్యాలు, అమ్మవారిని కీర్తిస్తూ సాగే భజనలతో.. కల్యాణోత్సవం కొండంత సంబురాన్ని తలపిస్తుంది. ఈఏడాది ఆలయం ముందు భారీ షెడ్డు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
జులై 12న కలశస్థాపనతో ఎదుర్కోలు ఉత్సవాలు ప్రారంభం
13న అమ్మవారి కల్యాణం
ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు..
ఈ ఏడాది బోనాల(Bonalu) నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఘనంగా నిర్వహించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. సోమవారం గోల్కొండ బోనాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. మంగళ, బుధవారాల్లో బల్కంపేట, సికింద్రాబాద్ ఆలయాల్లో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగుల పనులు పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రముఖులకు అందజేసే ఆహ్వానాలను సిద్ధం చేశారు. ఏర్పాట్లపై ఈఓ జి.మనోహర్‌రెడ్డి ఇప్పటికే సిబ్బందితో సమావేశం నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో విద్యుత్ దీపాలంకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయం ఎదుట నూతనంగా నిర్మించిన షెడ్డు నిర్మాణం పూర్తయ్యింది. ఉత్సవాల నిర్వహణపై ఆలయంలో సిబ్బందితో ఈఓ ఎస్.అన్నపూర్ణ ఇటీవల సమావేశాన్ని నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. ఉత్సవాల్లో సేవలందించే వాలంటీర్ల వివరాలు సేకరిస్తున్నారు. గోల్కోండ బోనాల ఉత్సవాల్లోనూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
- ఇదీ చదవండి : Bonalu: జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు