Bonalu Festival in London: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్(టాక్) ఆధ్వర్యంలో... లండన్‌లో రెండు రోజులుగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసీలు హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకునే విధంగా సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి... లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు చేశారు. ముఖ్యంగా పోతురాజు విన్యాసాలు ప్రవాసీ బిడ్డలనే కాకుండా స్థానికులను ఆకట్టుకున్నాయి. లండన్‌కి ఉన్నత చదువుల కోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్... వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషధారణతో ఉత్సవాల్లో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు. అదే విధంగా చిన్నారులు, పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అదరగొట్టారు.
యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని భారత సంతతికి చెందిన స్థానిక ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. వారి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు. లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని... మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని, సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు.
టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం... లండన్‌లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో శ్రమించిన నాయకుడని ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. ఆయన కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఎఫ్డీసీ చైర్మన్‌గా సముచిత స్థానం కల్పించినందుకు... సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇవీ చదవండి: