![పిట్టల కూత వినేద్దాం.. పక్షుల లెక్క తేల్చేద్దాం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-08-03-salim-ali-bird-count-spl-pkg-3181980_03112020232059_0311f_1604425859_595.jpeg)
ఈ నెల 12న ప్రఖ్యాత పక్షిశాస్త్రవేత్త, "బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా" గా పేరుగాంచిన సలీం అలీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 5 నుంచి నవంబర్ 12 వరకూ 'సలీం అలీ బర్డ్ కౌంట్ ' పేరిట జాతీయ స్థాయి ఈవెంట్‌ను నిర్వహించాలని బోంబే నేచురల్ హిస్టరీ సొసైటీ నిర్ణయించింది. మహారాష్ట్రలో ఏటా వారం రోజుల పాటు నిర్వహించే పక్షి సప్తాహ్ను ఇందులో మిళితం చేస్తూ ఈ సారి 8 రోజులు జరిగేలా ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రకృతి, పక్షులంటే ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరినీ ఇందులో భాగస్వామ్యం చేసేలా సిటిజన్ సైన్స్ ప్రోగ్రాంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
అందులో భాగంగా.. 8 రోజుల పాటు మనకి వీలయ్యే సమయాల్లో..మన పరిసరాల్లో కనిపించే విభిన్న రకాల పక్షులను వాటిని పరిశీలించటం, లెక్కపెట్టటం, ఫోటోలు తీయటం, వాటి ధ్వనులను వీలైతే రికార్డు చేయగలటం ద్వారా www.eBIRD.org/India అనే వెబ్ సైట్ లాగిన్ అయి నమోదు చేసే అవకాశాన్ని కల్పించింది.
![పిట్టల కూత వినేద్దాం.. పక్షుల లెక్క తేల్చేద్దాం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-08-03-salim-ali-bird-count-spl-pkg-3181980_03112020232059_0311f_1604425859_939.jpeg)
ఎనిమిది రోజుల పాటు కనీసం రోజులో 15నిమిషాల పాటైనా ఉదయం, సాయంత్రం మన పరిసరాల్లో కనిపించే పక్షులను లెక్కపెట్టటం, వాటికి సంబంధించిన డేటాను వెబ్ సైట్ లో నిక్షిప్తం చేయటం ద్వారా వారి పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ శీతాకాలంలో మన ప్రదేశాల్లో ఎలాంటి పక్షులు వస్తున్నాయి.. ఎంత సంఖ్యలో వస్తున్నాయి.. వాటి జీవనశైలి ఎలా ఉంది..ఏమన్నా మార్పులు ఉన్నాయా అనే అంశాలను ఓ అంచనాకి వచ్చేందుకు పక్షి శాస్త్రవేత్తలకు వీలు కలగనుంది.
![పిట్టల కూత వినేద్దాం.. పక్షుల లెక్క తేల్చేద్దాం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-08-03-salim-ali-bird-count-spl-pkg-3181980_03112020232059_0311f_1604425859_107.jpeg)
దీంతో పాటు పక్షుల జీవనశైలిని గమనించటాన్ని మన దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా వాటి ఉపయోగాలు తెలుసుకోవటం, వాటి ఆవశ్యకతను మనంతట మనమే గ్రహించగలటం ఈ కార్యక్రమం ఏర్పాటుకు ముఖ్య కారణంగా నిర్వాహకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా తర్వాతి తరాలకు వాటి ఆవశ్యకతను వివరించేందుకు దోహదపడుతుందని బోంబే నేచురల్ హిస్టరి సొసైటీ కోరుతోంది.