తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పంటు ఢీకొనడంతో పడవలో ఉన్న కొందరు తెదేపా సీనియర్ నేతలు నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు లైఫ్ జాకెట్ల సాయంతో వారిని సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబుతో పాటు పలువురు తెదేపా నేతలు ఈరోజు సాయంత్రం రాజోలులంక చేరుకున్న క్రమంలో పడవ ప్రమాదం జరిగింది.
చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటులో నుంచి దిగి రాజోలు లంక వెళ్లేందుకు మరపడవలోకి మారాల్సి వచ్చింది. మర పడవలో చంద్రబాబు వెళ్తుండగా.. ఆయనతో పాటు మరో పడవలో తెదేపా నేతలు వెళ్లేందుకు అందరూ ఒక్కసారిగా పంటు చివరకు రావడంతో అదుపుతప్పి మరో బోటును ఢీకొంది. ఈ ఘటనలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, కొందరు మీడియా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా నీటిలో పడిపోయారు.
నదికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. లైఫ్ జాకెట్ల సాయంతో నీటిలో పడిపోయిన వారిని సురక్షితంగా కాపాడారు. అందరూ ఒడ్డుకు చేరిన తర్వాత చంద్రబాబు రాజోలులంక బయల్దేరారు.
ఇవీ చూడండి..
'పోలవరాన్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారు'
డిప్యూటీ కలెక్టర్‌కు చేదు అనుభవం.. నడిరోడ్డుపై చితకబాదిన భార్యాభర్తలు