ETV Bharat / city

కళ్లు లేకుంటేనేం... కష్టాలను ఓడించి కలెక్టరయ్యాడు! - తొలి అంధ ఐఏఎస్​

ప్రతి సంవత్సరాదినీ ఎంతో సానుకూల దృక్పథంతో ఆహ్వానిస్తుంటాం మనం. 2021... కొవిడ్‌ నేపథ్యంలో వచ్చిన కొత్త సంవత్సరం కాబట్టి ఆ సానుకూలత మరింత ఎక్కువుండాలి కదా! దాన్ని మనకు మెండుగా అందిస్తుంది కట్టా సింహాచలం జీవితం. తెలుగు రాష్ట్రాల నుంచి ఐఏఎస్‌ హోదాని అందుకున్న తొలి అంధుడాయన! ఓ పక్క చూపులేకపోవడం మరోపక్క కటిక పేదరికం... ఆ రెండింటినీ అధిగమించి తారాజువ్వలా ఎగిశారు సింహాచలం. మారుమూల పల్లెలో పుట్టిన ఆ వెదురు చువ్వ కెరీర్‌లో అత్యున్నత తారకని అందుకున్న స్ఫూర్తి కథ ఇది...

blind person became collector
blind person became collector
author img

By

Published : Jan 3, 2021, 4:52 PM IST

కళ్లు లేకపోవడం అంటే ఏమిటీ? వెలుగుని చూడలేకపోవడమా... చీకటంటే తెలియకపోవడమా! రెండూనూ. కానీ నా వరకూ నేను రెండోదాన్నే తీసుకుంటాను. ప్రపంచమంతా చూస్తున్న వెలుగుల్ని నేను చూడలేకపోతున్నానని బాధపడటం కన్నా... అసలు చీకటంటే ఏమిటో తెలియని విధంగా దేవుడు నన్ను సృష్టించాడని సంతోషిస్తాను. అదే పాజిటివ్‌ దృక్పథం అని నేను నమ్ముతాను. కానీ ఇది ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకమో చూసి నేర్చుకున్నది కాదు... అక్షరాలేవీ తెలియని నా కుటుంబసభ్యులు నాకు నేర్పింది. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని గూడపల్లి గ్రామంలో గంటాలమ్మ గుడి దగ్గరుండే పూరి గుడిసెల్లో మా ఇల్లూ ఒకటి. మా నాన్న వాలి... వ్యవసాయ కూలీగా చేస్తుండేవాడు. కూలీ లేనప్పుడు చుట్టుపక్కలున్న రేషన్‌ షాపులకెళ్లి వాళ్ల దగ్గరున్న గోనెసంచులు తీసుకుని... వాటిని పాలకొల్లులోని కొబ్బరి వ్యాపారులకి అమ్ముతుండేవాడు. అలా వచ్చిన నాలుగురాళ్లతోనే ఆరుగురి ఆకలి తీర్చాల్సి వచ్చేది. ఆరుగురు అంటే నేను పుట్టడానికి ముందు సంగతి... అప్పట్లో అమ్మానాన్నలతోపాటూ మా ముగ్గురన్నలూ, అక్కా ఉండేవారు. అమ్మకి సరైన పోషకాహారం లేకపోవడం వల్ల నేను కడుపులో పడ్డాక అనారోగ్యానికి గురైందట. అప్పుడు వాడిన మందులతో గర్భంలో నా ఎదుగుదల దెబ్బతింది... సరిగ్గా చెప్పాలంటే కంటినీ, మెదడునీ అనుసంధానించే నరాలవ్యవస్థ వృద్ధికాలేదు. దాంతో నేను అంధుడిగానే పుట్టాను. కానీ ఆ విషయాన్ని నాకు నాలుగేళ్లు వచ్చేదాకా ఎవరూ గుర్తించలేకపోయారు. గుర్తించాక జిల్లాలోని ఎన్నో ఆసుపత్రులకి తిప్పారు కానీ... అప్పటికే వైద్యులు ఆలస్యమై పోయిందని చెప్పారట. అది తెలిసిన రోజు అమ్మావాళ్లు ఎంత కన్నీరుమున్నీరయ్యారో నాకు గుర్తులేదుకానీ... అప్పటి నుంచీ నా కంట మాత్రం చుక్కనీరు కూడా రానివ్వలేదు!

పట్టుబట్టి మరీ...

అమ్మానాన్నా, అక్కా, అన్నయ్యల ఆదరణలో ‘అయ్యో కళ్లులేవే’ అన్న బాధ నాకెప్పుడూ రాలేదు. పైగా అందరికన్నా చిన్నవాణ్ణి కాబట్టి గారాబంగానే చూసేవారు. అమ్మానాన్నలకి చదువురాకున్నా ఎంతోమందిని ప్రాధేయపడి నర్సాపురంలోని అంధుల బడిలో చేర్చారు. అదో రెసిడెన్షియల్‌ స్కూల్‌. నన్నక్కడ వదిలిపెట్టి వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు అక్కా, అన్నయ్యలూ, అమ్మానాన్నలూ ఎంతగా ఏడ్చారో నాకిప్పటికీ గుర్తుంది. ఆ ఒక్కసారే కాదు... ప్రతిసారీ నేను హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చి తిరిగి వెళ్లేటప్పుడల్లా ఇంట్లోవాళ్లెవరికీ కన్నీళ్లు ఆగేవి కావు. దాన్ని చూసి మా బంధువులంతా ‘ఆడపిల్ల అప్పగింతల్లా ఆ ఏడుపేమిటీ?!’ అనేవాళ్లు. పోనుపోను ఆ ఎగతాళి కాస్తా ‘వీడు చదివి కలెక్టర్‌గిరీ చేస్తాడా ఏం? మీరు కలోగంజో తాగి కష్టపడుతూ వాణ్ణి చదివించడమెందుకు... వృధా!’ అనేలా మారిందట. అమ్మానాన్నా వాళ్లమాటలు వినలేదు సరికదా... అలా అన్నవాళ్లందరినీ దూరం పెట్టేశారు! వాళ్లలోని ఆ పట్టుదలకి తగ్గట్టే నేను బాగా చదవాలనుకున్నాను. సాధారణంగానే అంధుల్లో వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరో వస్తువుని రంగులూ, పరిమాణాలతో గుర్తించినట్టే... మేం శబ్దంలోని స్థాయీభేదాలని బట్టి దాన్ని మనసులో ముద్రించుకుంటాం. వినడంలో నాకున్న ఆ తీక్షణతనే నేను ఆయుధంగా మలచుకున్నాను. దానికి బ్రెయిలీని ఆసరాగా చేసుకున్నాను. క్లాసులో ఫస్ట్‌ ర్యాంకు సాధించడం మొదలుపెట్టాను. ఏడో తరగతికల్లా రాష్ట్ర ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాను. ఎనిమిదో తరగతి నుంచీ డాక్టర్‌ని కావాలని కలలుకన్నాను. అప్పట్లో ఇంగ్లిషు వస్తేనే డాక్టర్‌ కావడం సాధ్యమనుకునేవాణ్ణి. కానీ నాకోసం ప్రత్యేకంగా ఇంగ్లిషు ఎవరు నేర్పుతారు! అందుకని నేనే సొంతంగా తయారవడం మొదలుపెట్టాను. నేను చదివిన అంధుల మిషనరీ బడిలో తెలుగు-ఇంగ్లిషు-హిందీ మూడు భాషలకీ చెందిన బ్రెయిలీ బైబిల్‌ ఉండేది. అందులోని ఒక్కో వాక్యాన్నీ ఇంగ్లిషులో చదవడం... దానికి సమానమైన దాన్ని తెలుగులో చూడటం... అప్పటికీ అర్థంకాకపోతే ప్రతిపదాన్నీ డిక్షనరీలో వెతకడం... ఇలా చేసేవాణ్ణి. ఏడాదితిరక్కుండానే ఇంగ్లిషు మాట్లాడటం, రాయడంలో తోటి విద్యార్థులకన్నా ముందు నిలిచాను. అప్పటికే అంధులు వైద్యులు కాలేరనే చేదునిజం తెలిసినా నేను ఏదో ఒక సబ్జెక్టు కోసం శ్రమించడం మాత్రం మానుకోలేదు. పదో తరగతిలో నాకు మంచి మార్కుల్ని అందించిందీ అలవాటు.

అమ్మ నిబ్బరమే...

ఇంటర్మీడియట్‌కు మా మండలకేంద్రం మలికిపురంలోని ఏవీఎన్‌జేఎస్‌ అండ్‌ ఆర్‌వీఆర్‌ కాలేజీలో చేరాను. అక్కడా మంచి మార్కులు తెచ్చుకోవడమే కాదు... ఇంటర్‌-కాలేజీ వక్తృత్వపోటీలూ, వ్యాసరచనల్లో మా కాలేజీకి ఎన్నో బహుమతులు సాధించిపెట్టాను. దాంతో ప్రతి ఒక్కరూ నన్ను ఆత్మీయంగా చూసేవారు. ఆ అభిమానం ఎంతగా ఉండేదంటే... ఇంటర్మీడియట్‌ పూర్తయి నేను అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు లెక్చరర్లూ, విద్యార్థులూ అందరూ కలిసి నాకు ఒక ఉంగరం బహుకరించారు. ఆ ఉంగరం ఇప్పటికీ నా దగ్గరే ఉంది.

‘ఇప్పటికీ ఉంది’ అని ఎందుకు చెబుతున్నానంటే... అలాంటి విలువైన వస్తువులెన్నో అమ్మి మరీ చదువుకోవాల్సిన పరిస్థితి ఆ తర్వాత ఏర్పడింది కాబట్టి! ఆ రోజు నేను కాలేజీ నుంచి వచ్చినప్పుడు పలకరించిన నాన్న గొంతు ఎందుకో నీరసంగా అనిపించింది. గోనెసంచుల మోతబరువు ఎక్కువై అలా ఉన్నాడనుకుని ఇంట్లోకి వెళ్లాను కానీ... అంతలోనే ఛాతీ నొప్పని కుప్పకూలిపోయాడు. అన్నయ్యలు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూశాడు. కళ్లులేని నాకు జీవితంలో తొలిసారి దిక్కుతోచకుండా పోయింది ఆ రోజే. అమ్మ నా కోసమే లేని నిబ్బరాన్ని తెచ్చుకుంది. ఇంట్లో ఎన్నికష్టాలున్నా నేను చదవాల్సిందేనని పట్టుబట్టింది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమకి ఉన్నాలేకున్నా నాకు ఫీజులు కట్టడానికి సిద్ధమయ్యారు. మా ఇబ్బందులు చూసి మలికిపురంలోని రోటరీ క్లబ్‌ నాకో కంప్యూటర్‌ అందించింది. అది నేనుఎన్నో అంశాలపైన లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడింది.

పత్రికలకెక్కాను...

అప్పట్లో మా కాలేజీలో ఓ జాతీయస్థాయి సదస్సు జరిగింది. ఎన్నో రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లూ, వీసీలూ వచ్చారు. సదస్సులో భాగంగా పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులందరినీ పేపర్‌ ప్రెజెంటేషన్‌ చేయమన్నారు. డిగ్రీ విద్యార్థులకి అవకాశం లేకున్నా సరే... నేను మా ప్రిన్స్‌పాల్‌ దగ్గర ప్రత్యేకంగా అనుమతి తీసుకుని ‘ఎన్నికల సంస్కరణలు’ అనే అంశంపైన ప్రెజెంటేషన్‌ ఇచ్చాను. తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థి... అందునా అంధుడు... అలా అనర్గళమైన ఇంగ్లిషులో, ఓ కొత్త కోణంతో పేపర్‌ ప్రెజెంటేషన్‌ చేయడం చూసి అతిథులందరూ ఆశ్చర్యపోయారు. నా గురించి అప్పట్లో తొలిసారి పత్రికల్లోనూ రాశారు. డిగ్రీ ఫస్ట్‌క్లాసులో పాసయ్యాను. అప్పుడు మా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం తప్పనిసరి కాబట్టి ఎడ్‌సెట్‌ రాశాను. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్థాయిలో 12వ ర్యాంకు సాధించి ఆంధ్రా వర్సిటీలో బీఎడ్‌ కోర్సులో చేరాను. అప్పుడు మెరిట్‌ స్కాలర్షిప్పుతోపాటూ ప్రతిభా పురస్కారం కూడా వచ్చింది. టీచర్‌నైతే చాలని వర్సిటీలో అడుగుపెట్టిన నాలో ఐఏఎస్‌ కలని నాటింది అక్కడి నా సహాధ్యాయులూ... ప్రొఫెసర్లే! ఒక్కసారి ఆ అగ్గిరవ్వ మనసులో పడ్డాక... అది జ్వాలగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు.

అతనే లేకుంటే...

బీఎడ్‌ ముగించగానే సివిల్స్‌ పోరాటం మొదలుపెట్టాను. 2011 చివర్లో దిల్లీలోని రవీంద్రన్‌ కోచింగ్‌ సెంటర్‌ని చూసివద్దామని వెళ్లాను. వాళ్లు నన్ను మూడు గంటలపాటు ఎన్నో ప్రశ్నలు వేశారు. నా సమాధానాలన్నీ విని... ‘నువ్విక్కడ చదివినంతకాలం నీ దగ్గర మేం ఏ ఫీజూ తీసుకోం!’ అని చెప్పారు. అప్పట్లోనే లక్షరూపాయల ఫీజుని నాకోసం వాళ్లలా మాఫీ చేయడం నన్ను కదిలించింది! ఇక ఆగలేదు... ఇంటికొచ్చి మా అన్నయ్య కొడుకు నాగబాబుని తోడు తీసుకుని దిల్లీకొచ్చాను. నా విజయాల వెనక వెన్నుదన్నుగా నిలిచింది ఈ అబ్బాయే. నాకు ఫీజు భారం లేకున్నా బసకీ, ఇతర ఖర్చులకీ డబ్బులు కావాలి కదా! ఆ డబ్బుని దిల్లీలో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ సమకూర్చేవాడు. ఉదయమంతా పనిచేసి... రాత్రి నాకు నోట్స్‌ చదివి వినిపించేవాడు. వంటా తనే చేసేవాడు. నేనైతే ఓ లక్ష్యం కోసం కష్టపడుతున్నాను సరే... అతను తన కెరీర్‌నీ వదులుకుని ఇలా కష్టపడటం చూసి నాకు గిల్టీగా ఉండేది. తనేమో ‘నేను రేపు ఎలాగైనా బతగ్గలను. నువ్వలా కాదు... నీ లక్ష్యాన్ని చేరుకోకపోతే ఎన్నో అవమానాలు పడాల్సి ఉంటుంది!’ అనేవాడు. అందుకే, నాకంటే చిన్నవాడైనా సరే తల్లీతండ్రీ గురువుల తర్వాత నాగబాబుకే నేను నమస్కరిస్తాను!

ఓటమితోనే మొదలు...

దిల్లీకి వెళ్లగానే సివిల్స్‌ రాశాను కానీ ప్రిలిమ్స్‌ దాటలేకపోయాను. ఆ తర్వాతి ఏడాదీ చుక్కెదురైంది. కానీ ఆ సంవత్సరం టీచర్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ పడింది. దాంతో సివిల్స్‌తోపాటూ కేవీ టీచర్లకి సంబంధించిన ‘సీటెట్‌’ పరీక్షలకి హాజరయ్యాను. తీవ్రపోటీ నడుమ మంచి ర్యాంకు సాధించాను. 2014లో సికింద్రాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగం వచ్చింది. ఏడు నుంచి పదో తరగతికి సోషల్‌ సైన్సెస్‌ టీచర్‌గా వెళ్లాను. తొలిరోజు ఆందోళనగానే అనిపించింది ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలనా అని. కానీ, కాసేపు పిల్లలతో నవ్వుతూ మాట్లాడగానే ఉత్సాహం వచ్చేసింది. పిల్లల మధ్య ఉంటే గాల్లో తేలుతున్నట్టే ఉండేది! అక్కడ టీచర్‌గా మంచి పేరుతెచ్చుకున్నా ఐఏఎస్‌ కల నన్ను దహించడం మానలేదు. దాంతో మళ్లీ సివిల్స్‌ రాసి... 2014లో తొలి విజయాన్ని అందుకున్నాను. 1212 ర్యాంకు వచ్చింది. ఇండియన్‌ ట్రేడ్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ హోదాలో అడుగుపెట్టాను. దిల్లీలో ఉద్యోగం. అక్కడ ట్రెయినింగ్‌ పూర్తికాగానే మళ్లీ రాసి ఈసారి 538 ర్యాంకు సాధించాను. అలా ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌)లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ చేరిన మూడునెలల్లోనే 230 ఐటీ అసెస్‌మెంట్‌లని పూర్తిచేయడం, ఐటీ కలెక్షన్‌ లక్ష్యాలని సాధించడంతో బెస్ట్‌ పెర్ఫామర్‌గా నిలిచాను. అయినాసరే... ఐఏఎస్‌ కల రొదపెడుతూనే ఉండటంతో 2018లో సివిల్స్‌ రాస్తే... 457 ర్యాంకొచ్చింది! ఆ రకంగా నా ఆరేళ్ల పోరాటం ఫలించి ఐఏఎస్‌ దక్కింది. ఏడాది శిక్షణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఇచ్చారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా చేస్తున్నాను. వెనకపడిన ఆ జిల్లాలో నిరుపేదలకీ, సర్కారుకీ వంతెనగా... స్పందన కార్యక్రమానికి ఇన్‌ఛార్జిగా ఉంటున్నాను.

అన్నట్టు... ఈ మధ్యే నాకు పెళ్లైంది. తన పేరు దుర్గాప్రసన్న... మొన్నటిదాకా తణుకు కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా చేసేది. ఒకప్పుడు అమ్మ, ఆ తర్వాత నాగబాబులా ఇప్పుడు తనే... కళ్లులేని నాకు చూపుగా నిలుస్తోంది!

ఇదీ చూడండి: టీకా అనుమతులు వచ్చేశాయ్​.. పంపిణీ ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.