Bandi sanjay letter to KCR: రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలుకాకపోవడం బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కౌలు రైతుల పట్ల తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇది క్షమించరానిదన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు సంజయ్ లేఖ రాశారు.
అఖిలపక్ష భేటీ నిర్వహించండి..
కాయకష్టం చేసే కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా, యంత్ర లక్ష్మి సహా ప్రభుత్వ పథకాలేవీ వర్తించకపోవడం అన్యాయమన్నారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందే సౌకర్యమూ కౌలు రైతులకు లేకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు భరోసా కల్పించేలా కౌలు చట్టంలో మార్పు తీసుకురావాలని 11వ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నా.. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు.
కౌలు రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని నాబార్డు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుకు బోనస్ సహా ఎరువులు, విత్తనాలతో పాటు వ్యవసాయ సబ్సిడీలన్నీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై చర్చించేందుకు రైతు సంఘాలు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీలతో తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
ఇదీచూడండి : రియల్టర్లపై కాల్పులు.. ఇద్దరి మృతి.. పోలీసుల అదుపులో అనుమానితుడు