ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో భాజపా రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 15 అంశాలపై తీర్మానాలు చేసినట్లు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం కులాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశం సాగింది. భాజపా రాష్ట్ర ఇంఛార్జీ మురళీధరన్, సహ ఇంఛార్జీ సునిల్ ధియోదర్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు నేరుగా హాజరయ్యారు. సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విష్ణువర్ధన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
కొత్త ఇసుక పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దందాకు పాల్పడుతున్న తీరుపై సమావేశంలో చర్చించాం. రైతులకు వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో భాజపా ఆధ్వర్యంలో కిసాన్ జాగరణ్ పేరిట రైతు ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానం చేశాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో 14న గుంటూరు, 17న విశాఖ జిల్లా పాయకరావుపేట, 19న నంద్యాలలో ర్యాలీలు నిర్వహిస్తాం. వైకాపా అధికారంలోకి వచ్చాక రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరమ్మతులు చేయకపోవటంతో రోడ్లు గుంతలతో నిండిపోయిన తీరును సమావేశంలో చర్చించాం. ఇసుక దందాతో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సమావేశంలో తీర్మానం చేశాం. అధికారాన్ని వినియోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న తీరుపై సమావేశంలో చర్చించాం. స్థానిక ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. అగ్ర వర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ అమలు, కేంద్ర ఆరోగ్య పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చడం, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైకాపా సర్కార్ వ్యవహారాలపై సమావేశంలో తీర్మానం చేశాం- విష్ణువర్ధన్ రెడ్డి, భాజపా నేత
కార్యవర్గ సమావేశం అనంతరం భాజపా ఆధ్వర్యంలో తిరుపతి నగర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్ స్టాండ్ నుంచి తీర్థకట్ట వీధి మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ శోభాయాత్ర సాగింది.