రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే కేంద్రం ధాన్యం ఎలా కొనుగోలు చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం కొనుగోలు చేస్తా అంటున్నా.. కేసీఆర్ సహకరించడం లేదని అన్నారు.
కేసీఆర్‌కు కమీషన్ వస్తోంది..
ధాన్యం కొనేది లేదని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని బండి సంజయ్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కొంటున్నట్లే తెలంగాణలోనూ కేంద్రం వడ్లు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రైతులు వడ్లు మాత్రమే పండిస్తారని.. బాయిల్డ్ రైసు పండించరని అన్నారు. మధ్యవర్తిగా రాష్ట్రంలో కేసీఆర్ వడ్లు కొనాల్సిందేనన్న సంజయ్.. దానికి కమీషన్ కూడా కేంద్రం ఇస్తోందని బండి చెప్పారు.
వచ్చే ఎన్నికలో భాజపాదే విజయం..
"కేసీఆర్ మూర్ఖత్వం వల్ల తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభించారు. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోళ్లపై కొత్త ఉద్యమం లేవనెత్తుతున్న కేసీఆర్ విధానాలతో వాళ్లు ధాన్యం అమ్మడానికి మళ్లీ అవస్థలు పడాల్సిన పరిస్థితి. ధాన్యం కొంటామని కేంద్రం స్పష్టం చేసినా.. ముఖ్యమంత్రి దానికి సహకరించడం లేదు. అప్పుడేమో బాయిల్డ్ రైస్ ఇవ్వనని ఒప్పందం రాసి.. ఇప్పుడేమో వడ్లే కొనుగోలు చేయాలని కొత్త డిమాండ్‌తో వచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు చూసిన కేసీఆర్‌కు దడ పుట్టింది. 105 స్థానాల్లో గెలుస్తామని ధీమాతో ఉన్నారంట.. 95 నుంచి 105 తెరాసవి కాదు భాజపా స్థానాలవి. కావాలంటే సర్వే నివేదిక తెప్పించుకుని చూడండి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది భాజపా ప్రభుత్వమే."
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరు
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని బండి సంజయ్ ఆరోపించారు. నిత్యం రాజకీయాలు తప్ప.. ప్రజల గురించి పట్టించుకునే తీరిక లేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోతున్నా.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ఇదేం పట్టనట్లు కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ పాలనకు ప్రపంచ దేశాలు సెల్యూట్..
మరోవైపు.. మోదీ పాలనకు ప్రపంచ దేశాలు జై కొడుతున్నాయని బండి సంజయ్ అన్నారు. భాజపా సర్కార్ విదేశాంగ విధానాలకు విదేశాలన్నీ సలామ్ అంటున్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించిన ఘనత మోదీ సర్కార్‌ది అని తెలిపారు. కరోనా కాలంలో దేశంలో తీసుకున్న విధానాలు చేపట్టిన చర్యలకు డబ్ల్యూహెచ్‌ఓ సహా వివిధ దేశాలు ప్రశంసించాయని వెల్లడించారు. అలాంటి మోదీ పాలనను కాంగ్రెస్ పాలనతో పోల్చడమేంటని కేసీఆర్‌ను బండి సంజయ్ నిలదీశారు.
- ఇదీ చదవండి : కాంగ్రెస్‌లో కాక.. ఈసారి దిల్లీ చేరిన విభేదాలు