Bandi Sanjay on Students Suicide : ప్రభుత్వం తప్పిదం వల్లే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పిల్లలు బలవన్మరణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులెవరూ ధైర్యం చెడొద్దని.. ఇంకా ముందు ముందు మంచి భవిష్యత్ ఉందని.. నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు.
Bandi Sanjay on Inter Results : కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. ఫెయిలైన విద్యార్థుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే ఉండటం దీనికి నిదర్శనమని అన్నారు. తమ చావుకు కారణం తెరాస సర్కార్.. మంత్రి కేటీఆరేనని ఓ విద్యార్థి స్వయంగా ట్వీట్ చేయడం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా విఫలమైందో అర్థమవుతోందని పేర్కొన్నారు.
Bandi Sanjay on Inter Students Suicide : గతంలో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకానికి 27 మంది ఇంటర్ విద్యార్థులు బలయ్యారని సంజయ్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతికి ఇంకెంత మంది బలికావాలని ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిలవడానికి సర్కార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉచితంగా రీ-వాల్యూయేషన్ చేయించాలని కోరారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకూ వెనకాడబోమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :