Bandi Sanjay on kcr: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, తెదేపా పాలనను మించి కేసీఆర్ పాలనలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ప్రజలంతా తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపాను ఆదరిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలని శ్రేణులకు సూచించారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర శిక్షకుల శిక్షణా సమావేశం ప్రారంభానికి బండి సంజయ్, ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, శిక్షణా కమిటీ కన్వీనర్ డా.ఓఎస్రెడ్డి హాజరయ్యారు. వర్చువల్ పద్ధతిలో ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారనడానికి.. దేశ చరిత్రతోపాటు ఉమ్మడి ఏపీ చరిత్రలోని అనేక సంఘటనలే నిదర్శనమన్నారు బండి సంజయ్. తెలంగాణలో భాజపాకు అవకాశం ఇస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే భావనలో ప్రజలున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రజలకు విశ్వాసం కల్పించి వారి పక్షాన పోరాడాల్సిన బాధ్యత భాజపా నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు.
ఇదీచూడండి: TSRTC CHAIRMAN: ఉదారత చాటుకున్న టీఎస్ఆర్టీసీ ఛైర్మన్.. ఎండీ సజ్జనార్‌కు లేఖ