రాష్ట్ర బడ్జెట్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. బడ్జెట్ బారెడు.. ఖర్చు జానెడు అంటూ ఎద్దేవా చేశారు. 2014లో తెలంగాణకు రూ.70 వేల కోట్లు అప్పులుంటే.. ప్రస్తుతం రూ.2.30 లక్షల కోట్లకు చేరాయని మండిపడ్డారు. ఓట్లు దండుకోవడమే తప్ప ప్రభుత్వానికి ప్రజల బాగోగులు పట్టట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్‌కు పొంతన లేదని విమర్శించారు.
పేదలకు రెండు పడక గదుల ఇళ్లు అటకెక్కాగా.. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం నిధులు తగ్గించిందన్నారు. సిబ్బంది లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు.
లోటును ఎలా పూడుస్తారు?
బడ్జెట్ లోటును ఎలా పూడుస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు. పలు పథకాలకు కేంద్రం ఇస్తోన్న నిధుల గురించి ప్రస్తావించలేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఎన్ని గ్రామాలకు నీరిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో యువతను వాడుకున్న కేసీఆర్.. నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆర్థిక మందగమనానికి కల్వకుంట్ల కుటుంబమే కారణమని నిప్పులు చెరిగారు.
ఇవీ చూడండి: ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు