Bandi Sanjay Comments: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను, సీఎం నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్యే అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రజాస్వామ్యవాదులంతా తెరాస దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.
'ఎంపీ అర్వింద్‌పై తెరాస దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెరాస నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి. నియంత వైఖరిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
తెరాస ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని.. కేసీఆర్ పాలనను, తెరాస నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. అయినా వారిలో ఏమాత్రం మార్పు రాకపోవడం అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. తెరాస నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటామని.. ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగిస్తామని సంజయ్ తెలిపారు.
మరోవైపు, ఎంపీ అర్వింద్‌పై దాడిని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోలేకే దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భాజపాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదన్నారు.
ఇవీ చదవండి: