కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కొవిడ్- 19 విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన కేసీఆర్ సర్కారు... ఆ నెపం కేంద్రంపై నెడుతోందని మండిపడ్డారు.
హెల్త్ బులిటెన్‌లో కూడా అరకొర సమాచారం ఉంటోందని... మరణాల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆక్షేపించారు. దుబాయికి వలస వెళ్లిన కూలీల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారని వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు మనోజ్ మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు.
" రాష్ట్రంలో డాక్టర్ల పరిస్థితి ఏంటి ఇవాళ? 70 మందికి కరోనా వచ్చిందంటే.. ఇంతకన్న దురదృష్టం ఇంకోటి లేదు. వారి సేవలకు గుర్తింపుగా దేశం మొత్తం చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు చెప్పే నైతికత లేదు"
--- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు