BJP Protest: రాష్ట్రవ్యాప్తంగా భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. సాయి గణేశ్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. ఖమ్మంలో జడ్పీ కూడలి వద్ద భాజపా కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ముందుగా ఖమ్మంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసిన భాజపా నాయకులు... కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెరాస ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలను వేధింపులు, అఘాయిత్యాలు తీవ్రతరం అవుతున్నాయని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి ఆత్మహత్య, రామయంపేట్ లో తల్లికుమారుడు ఆత్మహత్య కు అధికార పార్టీ నేతలు కారణమవుతున్నా డీజీపీ, తెరాస అధినాయకత్వం వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సుచిత్ర చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెరాస నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సాయి ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు భారీగా మోహరించి వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పీఎస్కు తరలించారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట భాజపా ధర్నా చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలకు అధికార పార్టీ నాయకులే కారణమని ఆరోపించారు. వారిని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. తెరాస హయాంలో అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. సుచిత్ర చౌరస్తాలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్లజెండాలతో ఆందోళన చేపట్టారు. పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. సాయి గణేష్ బలవన్మరణానికి కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కార్యకర్తలు ఆందోళన చేశారు. ర్యాలీగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నేతలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..
ఇవీ చూడండి: