దుబ్బాక ఉపఎన్నిక విజయోత్సాహంతో గ్రేటర్ బరిలో దిగిన కమలదళం తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. అక్కడి ఎన్నికలో గెలుపొందిన వారానికి గ్రేటర్ నగారా మోగింది. 14 రోజుల్లోనే ఎన్నికలు.. సమయం తక్కువ ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా ముందడుగు వేసి సత్ఫలితాలు సాధించింది. గత బల్దియా ఎన్నికల్లో 4 స్థానాలకే పరిమితమైనా.. ఈసారి కమలం వికసించింది. మేయర్ పీఠాన్ని భాజపా చేరుకోలేకపోయినా.. అధికార పార్టీతో పోటాపోటీగా సీట్లు సాధించగలిగింది. బల్దియా ఎన్నికలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా జాతీయ నాయకత్వం ఈసారి దృష్టి పెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తన శిష్యుడు భూపేంద్ర యాదవ్‌ను ఇన్‌ఛార్జిగా హైదరాబాద్‌కు పంపించగా.. చివరివరకు యాదవ్ బృందం రాష్ట్ర పార్టీకి మార్గనిర్దేశం చేసింది. జేపీనడ్డా, అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్ వంటి హేమాహేమీలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ విడుదల చేశారు. ఎన్నికల ప్రణాళిక విడుదలకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ విచ్చేశారు. ఇంకా యువమోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వచ్చి రాష్ట్ర నేతల్లో ధైర్యం పెంచారు. దీంతో భాజపా కేడర్ మరింత ఉత్సాహంగా పనిచేసింది.
అభ్యర్థులతో ప్రమాణం చేయించి
పట్టున్న ప్రాంతాలపై ముందే సర్వేలు చేసి తన బలాబలాలపై ఓ అంచనాకు వచ్చిన కమలదళం ఆయా డివిజన్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇంకోవైపు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషించింది. తెరాసలో కార్పొరేటర్లు, గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీచేసి ద్వితీయస్థానంలో నిలిచిన నేతలను బరిలో నిలిపింది. ఆయా ప్రాంతాల్లో పట్టున్నవారిని పార్టీలో చేర్చుకుంది. అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైనప్పటికీ నామినేషన్ల తర్వాత ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్- ‘అవినీతికి పాల్పడం, ప్రజలకు సేవకోసం పనిచేస్తాం, భాజపా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం’ అని అభ్యర్థులతో ప్రచారం చేయించడం.. ఓటర్లు తమవైపు మొగ్గు చూపడానికి దోహదం చేసిందని భాజపా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా భాజపా జాగ్రత్తగా వ్యవహరించింది. ప్రచారంలో నేతలు తెరాస, మజ్లిస్‌నే లక్ష్యంగా చేసుకుంది. అధికారపార్టీకి ప్రత్యామ్నాయం భాజపాయేనన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేలా చేసి సఫలమయ్యారు.
- ఎల్‌బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 11 డివిజన్లనూ గెలుచుకుంది. ముషీరాబాద్‌లో ఆరింట అయిదు, గోషామహల్‌లో ఆరింట అయిదు డివిజన్లను కాషాయ దళం కైవసం చేసుకుంది.
బల్దియాలో భాజపా
సంవత్సరం | పోటీ చేసిన సీట్లు | గెలిచినవి | ఓట్ల శాతం |
2016 | 65 | 4 | 10.34 |
2020 | 149 | 48 | 35.56 |
సంజయ్ వేగం.. కిషన్ వ్యూహం
గ్రేటర్ పోరులో భాజపా తరఫున రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. తెరాస, మజ్లిస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుంటూ సంజయ్ దూకుడుగా వ్యవహరించారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ నగరాన్ని చుట్టేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లపై అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యల విషయంలోనూ సంజయ్ రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను వరద సాయాన్ని అడ్డుకోలేదంటూ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానిక ఎంపీ అయిన కిషన్‌రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం వరకు తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించారు. సికింద్రాబాద్ పరిధిలో 13 మందిని గెలిపించుకున్నారు. ఇంకా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి, పి.మురళీధర్‌రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేశారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఇంద్రసేనారెడ్డి విస్తృతంగా తిరిగారు. సోషల్ మీడియా దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హైదరాబాద్‌లో కొన్ని రోజులు మకాం వేశారు.
ఇదీ చూడండి: బల్దియా పోరులో కారుకు కమలానికి తేడా 0.25 శాతం మాత్రమే