నీటి వివాదాలపై సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. విభజన తర్వాత నీటి విషయంలో తెలంగాణకు నష్టం జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని... ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం 512 టీఎంసీలు దక్కాయని వివరించారు.
కేంద్రం ట్రైబ్యునల్ వేయనందునే అన్యాయం జరిగిందని చెబుతున్నారని... ఏం జరిగినా కేంద్రంపై నెపం నెట్టడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని అన్నారు. కేసీఆర్ చేసిన తప్పుల మూలంగానే రాష్ట్రానికి రావాల్సిన నీరు రావట్లేదని ఆరోపించారు. జూరాల పూర్తి చేయకుండా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు అన్యాయం చేశారని డీకే అరుణ మండిపడ్డారు.
ప్రాజెక్టుల విషయంలో జగన్‌తో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఒప్పందం వల్లే పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టులు ముందుకెళ్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారన్నారు. నదీ జలాల పరిష్కారంపై ఉద్దేశపూర్వకంగానే కోర్టులకు వెళ్లారని చెప్పారు. ఏడేళ్లైనా పాలమూరు - రంగారెడ్డి పూర్తికాలేదని... ఇప్పుడు కొత్తగా అలంపూర్-పెద్దమారూర్ గురించి చెబుతున్నారని డీకే అరుణ అన్నారు.
ఇదీ చదవండి : చిన్నారులకు వ్యాక్సినేషన్లో సత్తా చాటిన తెలంగాణ సర్కారు