హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ను భాజపా ఎమ్మెల్యేలు రాజాసింగ్(Mla RajaSingh), రఘునందన్ రావులు పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. విశ్రాంతి తీసుకోవాలని ఈటలకు సూచించారు.
ఈటల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్(Mla RajaSingh) తెలిపారు. సోమవారం రోజున ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు. పాదయాత్ర కొనసాగించేందుకు ఈటల ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఈటల ఏడోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
"ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచానని ఈటల.. ఈసారి కూడా వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర మధ్యలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. అనంతరం.. పాదయాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఈటల ఏడోసారి నియోజకవర్గంలో గెలుపు బావుటా ఎగురవేస్తారు."
- రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే