హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట భూముల విషయంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా విచారణ చేయించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే తమకు మంత్రి పదవులు కావాలని ముగ్గురు ఎమ్మెల్యేలు అడుగుతున్నారని... లేదంటే సొంతంగా పార్టీ పెడతామని ప్రణాళికలు తయారుచేసుకుంటున్నారని ఆరోపించారు. దళితున్ని సీఎం చేస్తే తామూ సంతోషిస్తామన్న సంజయ్... ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆక్షేపించారు.
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గం నుంచి తెరాస, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నాయకులు భాజపాలో చేరారు. వారందరికి బండిసంజయ్... భాజపా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేంద్రం ఇచ్చే నిధులు కూడా టెండర్లు లేకుండా తెరాస నేతలే కాంట్రాక్టులు చేపడుతున్నారని విమర్శించారు. తెరాస నేతలు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. రాబోయేది భాజపా ప్రభుత్వమేనని... అప్పడు అందరి గుట్టు రట్టు చేస్తామన్నారు.