ధాన్యం కొనుగోలులో తెరాస ప్రభుత్వం... రైతులను తీవ్ర ఇబ్బందిపెడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యంతో రైతులు పండించిన ధాన్యం అకాల వర్షం పాలవుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచనతో రైతులు వణికిపోతున్నారని... ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యాన్ని కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బండి పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనే విషయంలో అధికారులకు ప్రణాళిక కొరవడిందన్నారు. అధికారులు, మిల్లర్ల మధ్య సమన్వయ లోపం వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ కాలనీ, నగునూరు, చిగురుమామిడి కల్లాల్లోని ధాన్యం వాన నీటిలో కొట్టుకుపోయిన విషయాన్ని బండి గుర్తుచేశారు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట, దండేపల్లిలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే ఆ రైతుల ఏడుపులు ఈ ప్రభుత్వానికి వినిపించడంలేదా అని సంజయ్ ప్రశ్నించారు.