కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా... పదోన్నతి పొందిన తర్వాత కిషన్‌రెడ్డి తొలిసారిగా.. నేడు రాష్ట్రానికి రాబోతున్నారు. కిషన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు రాష్ట్ర సరిహద్దులోని... సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని నల్లబండగూడెం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు సాగనున్న యాత్రలో... కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. 12 జిల్లాలు 17 అసెంబ్లీ, 8 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా... 305 కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది. యాత్రలో భాగంగా 40చోట్ల సభలు ఏర్పాట్లు చేశారు. అలాగే సేంద్రీయ వ్యవసాయంలో... జాతీయ అవార్డు గ్రహీతను కోదాడలో సన్మానిస్తారు. అక్కడి నుంచి యాత్ర సూర్యాపేట చేరుకుని.. రాత్రి అక్కడే బస చేస్తారు.
సూర్యాపేట నుంచి నరిసింహుని చెంతకు...
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా.. రేపు సూర్యాపేటలో యాత్ర తిరిగి ప్రారంభమై మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, తొర్రూరు మీదగా రాయపర్తి వద్ద... వరంగల్ జిల్లాలోకి ప్రవేశించి వర్ధన్నపేట మీదుగా వరంగల్ భద్రకాళి దేవాలయానికి చేరుకుంటుంది. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. హన్మకొండలోని వెయ్యి స్తంభాల ఆలయంలో పూజలు చేసి అదాలత్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని... ఖిలాశాపూర్ కోటను సందర్శిస్తారు. అక్కడి నుంచి జనగామ జిల్లా మీదుగా యాత్ర ఆలేరుకు చేరుకుంటుంది. ఆలేరులో చేనేత కార్మికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశంని కలిసి... సన్మానిస్తారు. ఆలేరు నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు.
యాదాద్రి నుంచి భాజపా రాష్ట్ర కార్యాలయానికి..
జన ఆశీర్వాదయాత్రలో భాగంగా ఎల్లుండి యాత్ర... యాదాద్రిలో ప్రారంభమై ఘట్‌కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం 6గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటుంది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభతో యాత్ర ముగియనుంది.
ఇదీ చూడండి:
Kishan Reddy: 'బడుగు, బలహీనవర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తి మోదీ'