ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ భక్తులు దీక్షలు విరమించారు. జయహో దుర్గాభవాని అంటూ భక్తుల నామస్మరణల మధ్య కార్యక్రమం వైభవంగా సాగింది. ఐదురోజులుగా దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగింది. యాగశాలలో స్థానాచార్యులు శివప్రసాదశర్మ పర్యవేక్షణలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రేపు కూడా కొనసాగనున్న దీక్ష విరమణలు..
కొందరు భవానీల విజ్ఞప్తి మేరకు ఆదివారం సైతం దీక్ష విరమణ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్టు ఆలయ ఈవో ఎం.వీ.సురేష్ బాబు తెలిపారు. ఇప్పటివరకు లక్ష 10 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. ఇవాళ, రేపు మరో 40 వేలు మంది దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా వైరస్ ప్రభావంతో భవానీ దీక్షధారుల సంఖ్య తగ్గినా.. ఆలయానికి వచ్చిన వారంతా పూర్తి జాగ్రత్తలతో అమ్మవారిని దర్శంచుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఏడాదిలోపు దేవస్థాన పనులన్నీ పూర్తి..
ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన శంకుస్థాపన కార్యక్రమాలన్నింటికీ టెండర్ల ప్రక్రియ జరుగుతోందని.. ఏడాదిలోపు మొత్తం పనులు పూర్తి చేయాలనేదే తమ సంకల్పమని దుర్గామల్లేశరస్వామి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ సోమినాయుడు తెలిపారు. ఆలయాల నుంచి డబ్బులు తీసుకున్న ప్రభుత్వాలనే ఇంతవరకు చూశామని.. ప్రభుత్వం డబ్బు ఇవ్వటం ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు, ఇతర కమిటీ సభ్యులు, ఘనాపాఠీలు, పండితులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'రైతుకు మద్దతు ధర ప్రకటించడంలో ప్రభుత్వం విఫలం'