ప్రమాదాల్లో కాళ్లూ, చేతుల్ని కోల్పోయినవాళ్లు జీవితంలో తామిక ముందుకు సాగలేమనీ, కష్టాల కడలి ఈదలేమనీ నిరాశా, నిస్పృహల్లోకి వెళ్తారు. వారి ఆందోళనకు కారణాల్లో మొదటిది అవయవాలు కోల్పోవడమైతే, రెండోది ఆర్థిక ఇబ్బందులు. అలాంటి అభాగ్యులకు కృత్రిమ అవయవాల్ని అందిస్తూ వారికి జీవితంపైన కొత్త భరోసానిస్తోంది భారతీయ వికాస్ పరిషత్. దిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు అనుబంధంగా ప్రారంభమైందే ‘భారతీయ వికాస్ పరిషత్ ఛారిటబుల్ ట్రస్ట్’. దీని వెనక కీలక వ్యక్తులు ‘అశ్విని’ సంస్థల ఛైర్మన్ సుబ్బారావు, కూకట్‌పల్లికి చెందిన సి.హెచ్.హనుమంతరావు. వీరి ఆలోచనను మరికొందరితో పంచుకోవడంతో 10 మంది సభ్యులతో కలిసి ఈ ట్రస్టును 1993లో స్థాపించారు. కూకట్‌పల్లిలో 355 చదరపు గజాల తన సొంత స్థలాన్ని ఇందుకోసం సుబ్బారావు కేటాయించగా... ట్రస్టు సభ్యులు నిధులు సమీకరించి నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు.
ఏడాదిలోనే కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. అప్పట్నుంచీ ఇక్కడ సేవలు మొదలయ్యాయి. ప్రారంభంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లబ్ధిదారుల్ని గుర్తించి రాజస్థాన్ జయపుర పంపేవాళ్లు. స్థానిక భాష తెలియకపోవడం, ప్రయాణానికి ఇక్కట్లు, సరైన ఆహారం లభించకపోవడంలాంటి సమస్యలు వాళ్లు ఎదురవుతుండడంతో తర్వాత కొన్నేళ్లకు అవసరమైన అవయవాలకు సంబంధించిన కొలతలు పంపి ఇక్కడికే నాణ్యమైన అవయవాలు వచ్చేట్టు ఏర్పాట్లు చేశారు. కొంతకాలం ఆ విధంగానే సేవలు అందించేవారు. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడంతో చివరకు హైదరాబాద్‌లోని ట్రస్టు భవనంలోనే కృత్రిమ అవయవాలను నాణ్యంగా తయారు చేయాలనుకున్నారు. ‘జయపుర్ ఫుట్’ నిర్వాహకులతో మాట్లాడి అందుకు అవసరమైన శిక్షణను కొందరికి ఇప్పించింది ట్రస్టు. రెండు దశాబ్దాల కిందట కూకట్‌పల్లిలోని భవనంలోనే అవయవాల తయారీకేంద్రాన్ని ఏర్పాటుచేసి అవసరమైన వారికి వాటిని అందిస్తూ వచ్చారు. కృత్రిమ కాళ్లతోపాటు చేతుల్నీ అందిస్తున్నారు.
దక్షిణాదిలో ఎవరికైనా..
తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర.. తదితర రాష్ట్రాల నుంచి వేల మంది బాధితులు కృత్రిమ అవయవాల్ని పొందడంలో ఈ ట్రస్టు సాయపడుతోంది. పిల్లలూ, యువకులూ, వృద్ధులూ... ఇలా అన్ని వయసులవాళ్లూ లబ్ధిదారుల్లో ఉన్నారు. కృత్రిమ అవయవాలు కావాల్సినవాళ్లు ఈ కేంద్రానికి ఉదయాన్నే చేరుకుంటే సాయంత్రానికల్లా వారి అవసరాలకు తగినట్టు అవయవాల్ని రూపొందించి అందిస్తారు. ప్రస్తుతం ముగ్గురు నిపుణులు సహాయక సిబ్బంది సాయంతో వీటిని తయారుచేస్తున్నారు. ఈ కృత్రిమ కాళ్లూ, చేతులూ ఎంతో తేలిగ్గా, వినియోగానికి వీలుగా ఉంటాయి. ఒకసారి అవయవాలు అమర్చుకున్నాక పెద్ద బరువులు ఎత్తడం తప్పించి తేలికపాటి పొలం పనులూ, కారు, బైకు నడపడటం లాంటివన్నీ చేయొచ్చు.
‘సాధారణ మనిషి చేయగలిగే అన్ని పనుల్నీ నేను చేస్తా. నా బైక్ నేనే నడుపుతాను. మునుపటిలానే ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుంటున్నా’ అని చెబుతాడు కొన్నేళ్ల కిందట ఇక్కడ రెండు కృత్రిమ కాళ్లను అమర్చుకున్న నళినీష్. ‘ప్రమాదం జరిగిన నాలుగు నెలలకు కృత్రిమ అవయవాలు అమర్చడానికి వీలవుతుంది. ఒకసారి అమర్చిన కాలు కనీసం రెండేళ్లపాటు పనిచేస్తుంది. పాదరక్షలు వేసుకుంటే అయిదేళ్లు మన్నుతుంది. ఆ తర్వాత ఇక్కడికి వస్తే మళ్లీ కొత్త అవయవాన్ని అమర్చుతా’ అని చెబుతారు ప్రాజెక్టు ఇంఛార్జి డాక్టర్ రంగారావు.
ఏడాదికి రూ.40 లక్షలు..
ఒక్కో కృత్రిమ అవయవం తయారీకి సగటున రూ.2500 ఖర్చవుతుంది. అవయవాలను అందించేందుకు ఏటా ట్రస్ట్ రూ.40 లక్షల వరకూ ఖర్చు చేస్తుంది. ‘ట్రస్టు సభ్యులతోపాటు మరికొందరు దాతలు విరాళాలు అందిస్తుండటంతో ఈ మహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అవయవాలు అవసరమైనవాళ్లు ఫోన్(040-2306 8721)లో సంప్రదించవచ్చ’ని చెబుతారు ట్రస్టు అధ్యక్షుడు అశ్విని సుబ్బారావు. ట్రస్టు సాయంతో మూడు, నాలుగుసార్లు అవయవాల్ని మార్చుకున్నవాళ్లు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఏటా దాదాపు 2000 మంది ఇక్కడ అవయవాల్ని పొందుతారు. ఇప్పటివరకూ 50వేల వరకూ అవయవాల్ని అందించి, వేలమంది విధి వంచితులు తమ తమ జీవితాల్లో ముందుకు సాగేలా చేసిందీ ట్రస్ట్.