చాలా వ్యాధులకు మీరు వ్యాక్సిన్‌లు తయారు చేశారు. ఆ అనుభవం కరోనా వ్యాక్సిన్‌కు ఎలా ఉపయోగపడింది?
అంటువ్యాధులకు వ్యాక్సిన్‌ల తయారీలో మేము అగ్రస్థానంలో ఉన్నాం. ప్లూ, చికున్‌గున్యా, జీకా వంటి వ్యాక్సిన్‌లు ప్రపంచానికి తొలిగా అందించింది మేమే. అంటు వ్యాధులు మనుషులను చంపేదే కాదు ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తుందని నేను గత పదిహేనేళ్లుగా చెబుతూనే ఉన్నాను. కానీ ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. కంపెనీగా చెప్తే... ఏదో లాభాలకోసం అనుకున్నారు. కానీ నేను ఊహించాను. అభివృద్ది చెందిన దేశాల నుంచే ఈ అంటువ్యాధులు వస్తున్నాయి.
భారత్‌లో అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నారు. మీరు కొంచెం ముందుగానే ఈ ఫలితలను బయటకు తెచ్చారు?
నాకు పోటీ భారత్‌లోని కంపెనీలు కాదు. చైనా, అమెరికా కూడా కాదు. నా పోటీ దారు కొవిడ్ మాత్రమే. ఎవరి గురించి ఆలోచించటం లేదు. సమాజానికి మంచి చేయటం గురించి మాత్రమే ప్రయత్నం.
అమెరికా, యూరప్, చైనా లో చాలా సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయని చెబుతున్నారు. మీరు వారి ఫలితాలను అధ్యయనం చేశారు?
వారందరివి అధ్యయనం చేశాము. వారి పరిశోధనలు, మార్కెట్ వ్యూహాలు తెలుసుకుంటున్నాం. వాటి కంటే... సైన్ ఏ విధంగా వెళుతోంది. జరుగుతోన్న ఆర్దిక నష్టం కూడా తెలసుకుంటున్నాం. ఇప్పుడు ఆరోగ్యంతో పాటు ప్రపంచ సంపద కూడా ముఖ్యమే.
వ్యాక్సిన్ వస్తే దాన్ని ఎలా ప్రజలకు చేరవెయ్యాలి. ముందు ఎవరికి అందించాలని ప్రధానితో ప్రభుత్వాలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇంత మందికి సరిపడా వ్యాక్సిన్ తయారీకి ఎన్ని రోజులు పట్టవచ్చు?
వ్యాక్సిన్ తప్పకుండా వస్తుంది. వంద శాతం ఇది సాద్యం. పూర్తి భరోసాతో నేను చెబుతున్నాను. దాంతో పాటు చికిత్స కూడా వస్తుంది. ఇప్పటికే వైరస్ సోకిన వారి కోసం కూడా మేము పనిచేస్తున్నాము. మనోక్లోన్ థెరఫీ, యాంటీ బాడీ ఇవ్వటం ద్వారా వారు కోలుకునే విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాము. వచ్చే ఆరు నెలల్లో మరికొన్ని చికిత్స విధానాలు కూడా అందుబాటులోకి వస్తాయి. వ్యాక్సిన్ ఎందుకు ఇంకా రావటం లేదంటే... చెప్పటం కష్టం. బయోలాజికల్ మెటీరియల్స్‌కు సమయం పడుతుంది. ఒక వైరస్ పరీక్షకు పదిహేను రోజులు పడుతుంది. ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. మేము 24 గంటలు పనిచేస్తున్నాం.
ఒకే కంపెనీ వ్యాక్సిన్ తయారు చేసి ఇంత మంది ప్రజలకు సరఫరా చేయటం సాధ్యమని అనుకుంటున్నారా?
వంద శాతం వచ్చే ఏడాదికల్లా ఇది పూర్తవుతుంది. 2021 నాటికి దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేయటం పూర్తవుతుంది. నాకు ఆ మేరకు పూర్తి నమ్మకం ఉంది. భారత ఫార్మారంగం తయారీ దారులకు ఆ సామర్థ్యం ఉంది.
కరోనా చికిత్స మందులు ఇప్పటి వరకు వచ్చినవి చాలా ఖరీదు ఉన్నాయి. వ్యాక్సిన్‌ల విషయంలో కూడా ప్రజలకు ఈ ఆందోళన ఉంది. మీరేమంటారు?
నేను ఖరీదు గురించి ఆలోచించటం లేదు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు. నాకు ఆ ఆలోచన ఉంటే ప్రభుత్వం నుంచి ఇస్తామన్న వంద కోట్లు తీసుకునే వాడిని. దానికి కనీసం దరఖాస్తు కూడా చేయలేదు. మొదట్లో ఖరీదు ఉన్నా...ఉత్పత్తి పెరిగే కొద్ది ధర తగ్గే అవకాశం ఉంది. మేము అమ్మే రేటుకు ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మలేనంత తక్కువ ధరకు దీన్ని తీసుకువస్తాం.
ప్రపంచం అంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. భారత్ బయోటెక్ అధినేతగా ప్రజలకు ఏమి చెప్తారు. ఎలాంటి భరోసానిస్తారు?
తప్పకుండా వ్యాక్సిన్ వస్తుంది. వచ్చే ఏడాది చివరి నాటికి నాణ్యమైన వ్యాక్సిన్ దేశంలోని ప్రజలందరికీ వేయటం పూర్తవుతుంది. ప్రపంచ దేశాలకు తీసిపోని విధంగా నాణ్యతతో కూడిన వ్యాక్సిన్ వస్తుంది. మమ్మల్ని నమ్మండి మేము దాన్ని నెరవేరుస్తాం. ప్రజల సెంటిమెంట్‌ను అర్థం చేసుకున్నాం. వంద మంది రాత్రింభవళ్లు పనిచేస్తున్నారు. బీఎస్ఎల్లో పనిచేస్తున్న వారు రెండు నెలలుగా ఇంటికి కూడా వెళ్లటం లేదు. అంత నిబద్ధతగా పనిచేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ ప్రతిష్ట కూడా అంతే ముఖ్యం. ఆ మేరకు వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి తీరుతాం.