లాక్‌డౌన్ సమయంలో దిగంతిక కూడా అందరిలా ఇంట్లోనే ఉంది. కానీ ఖాళీగా కూర్చోలేదు. మాస్క్‌లు ధరించినా అవి పూర్తిస్థాయిలో వైరస్‌ని నిలువరించలేకపోవడం గమనించింది. వైరస్‌ని అంతం చేసే మాస్క్‌ల తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకోసం తన గదినే ల్యాబ్‌గా మార్చుకుంది. వారం రోజుల పాటు పగలూరాత్రీ శ్రమించింది. ఆ శ్రమ ఫలితమే ‘ఎయిర్ ప్రొవైడర్ అండ్ వైరస్ డిస్ట్రాయర్ మాస్క్’. ఈ పరికరాన్ని ‘ది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా’ నిర్వహించిన పోటీలో ప్రదర్శించి విజేతగా నిలిచింది.
ధర రూ.250
ఈ పరికరంలో... వైరస్‌ని అంతం చేసే రసాయన ఛాంబర్లు రెండు ఉంటాయి. దీన్ని ధరిస్తే, రోగి గొంతులోకి వెళ్లే వైరస్‌ను నాశనం చేసి.. తాజా ఆక్సిజన్ ఆ వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్తుంది. దీని ఖరీదు రూ.250. దీని తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే ‘వైరస్ డిస్ట్రాయర్ వాటర్ గన్’ అనే మరో పరికరాన్ని కూడా తయారుచేసిందీ అమ్మాయి. విద్యుత్తుతో పనిచేస్తుందీ పరికరం. ఈ గన్‌ను వైరస్ ఉండే ప్రాంతాల్లో వినియోగించొచ్చు దీన్ని కూడా నేషనల్ ఇన్నోవేషన్ ఇండియా నిర్వహించిన పోటీలో ప్రదర్శించి శెభాష్ అనిపించుకుంది.
అలా మొదలైంది...
పశ్చిమ బంగాలోని ఈస్ట్ బర్దమాన్ జిల్లాకు చెందిన దిగంతికా ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి సుదీప్తోబోస్. చిరువ్యాపారి. తల్లి సువ్రాబోస్ ఉపాధ్యాయురాలు. చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులని గమనించడం, ఏవైనా సమస్యలుంటే తగిన పరిష్కారాలు వెతకడం దిగంతిక ప్రత్యేకత. రోడ్డు తవ్వుతున్నప్పుడు ఆ యంత్రంలోంచి వచ్చే దుమ్ము, ధూళి కార్మికుల ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అనారోగ్యాలు పాలుకాకుండా ఉండేందుకు ఓ యంత్రాన్ని కనిపెట్టింది. ఇలాంటి పరికరాలు చాలానే తయారు చేసింది దిగంతిక. ఈ ఆవిష్కరణలకుగాను 2017, ’18 సంవత్సరాల్లో రెండుసార్లు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డుని సాధించింది. గత ఏడాది సర్ సీవీ రామన్ యంగ్ సైన్స్ ఇన్నోవేటర్ అవార్డునీ అందుకుంది.
ఫిజిక్స్ అంటే ప్రాణం పెట్టే దిగంతిక భవిష్యత్తులో శాస్త్రవేత్త అయి ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు మరిన్ని చేస్తానంటోంది.
ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్