బతుకమ్మ సంబరాల్లో రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. సంబరాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొని బతుకమ్మ ఆడారు. అసెంబ్లీ ప్రాంగణంలోనూ సంబురాలు నిర్వహించారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి.. బతుకమ్మకు పూజలు చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉద్యోగులు బతుకమ్మ ఆడారు.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి రెండో రోజు వేడుకలు జరిపారు. రాంనగర్, బాలసముద్రం, యూనివర్శిటీ క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో సంబురాలు ఘనంగా జరిగాయి. ఖాజీపేటలో సౌత్ సెంట్రల్ రైల్వే యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం
ఉమ్మడి నిజామాబాద్‌లో బతుకమ్మ వేడుకలు కనుల పండువగా జరిగాయి. నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఖమ్మంలో జిల్లాలోనూ తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఒక చోటకు చేర్చి ఆడిపాడారు.
మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో..
బతుకమ్మ వేడుకలను విద్యాసంస్థల్లోనూ వైభవంగా నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ పాలమూరు విశ్వవిద్యాలయంలో బతుకమ్మ సంబరాలతో సందడిగా మారింది. వేడుకల్లో విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వివిధ విభాగాల వారీగా బతుకమ్మలను ఏర్పాటు చేయగా.. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు, సిబ్బంది, ఆచార్యులు బతుకమ్మ ఆడిపాడారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్సు డిగ్రీ కాలేజీలో బతుకమ్మ వేడుకలు జరిగాయి.
ఇదీ చూడండి: Bathukamma day 2: రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'.. నైవేద్యం ఏంటంటే?