గతేడాది లాక్‌డౌన్ విధించినప్పుడు పనుల్లేక వలసకార్మికులు సొంతూర్లకు ప్రయాణమవడం చూసింది అన్వి. అప్పుడామె డిగ్రీ మూడో ఏడాది చదువుతోంది. ఆ సమయంలో ఆకలితో అలమటించిన వారి గురించి వార్తల్లో చదివింది. వారికి సాయం చేయాలనుకుంది. తాను చదివిన విద్యాసంస్థ ప్రిన్స్‌పల్‌ను కలుసుకుని సాయాన్ని కోరింది. కొద్ది రోజుల్లోనే రూ.1.50 లక్షలు సేకరించగలిగింది. పప్పు, బియ్యం, ఉప్పు, నూనె వంటి నిత్యావసర వస్తువులతో మూడు వేల కేజీల రేషన్ కిట్స్‌ను తయారు చేయించింది. వలస కూలీల కుటుంబాలకు వాటిని పంపిణీ చేసింది. అందులో తన స్నేహితుల ప్రోత్సాహమెంతో ఉంది అని చెబుతుంది అన్వి.
‘రేషన్ స్క్వేర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను చేసిన సాయాన్ని మరికొందరు విద్యార్థులు తెలుసుకున్నారు. మరో 30 మంది నాతో చేయి కలిపారు. విరాళాలు కూడా పెరిగాయి. రెండోసారి రూ.5లక్షలు రాగా, 10వేల కేజీల రేషన్‌కిట్స్ తయారు చేసి అవసరంలో ఉన్న వారికి పంపిణీ చేయగలిగాం. అంతా సద్దుమణిగింది అనుకునే దాన్ని. అనుకోకుండా కొవిడ్ రెండోసారి విరుచుకుపడింది. ఈసారి సరైన సమయంలో చికిత్స అందక పేదలెందరో ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈసారి మరొక దిశగా సేవలందించాలనుకున్నా. ‘మెర్సీ మిషన్’ అనే ఎన్జీవోతో కలిసి ఈ ఏడాది విరాళాలను సేకరించాం. వచ్చిన నగదుతో ఆక్సిజన్ సిలిండర్స్, అంబులెన్స్ సేవలు, కొవిడ్ బాధితులకు చికిత్సను అందించేలా చేశాం. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మా రేషన్‌స్క్వేర్ సాయంతో ఎందరో పేద రోగులు చికిత్స తీసుకుని కరోనా నుంచి బయటపడ్డారు. ఇది మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈసారి మాకు ఎక్కువగా విరాళాలు కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచే అందాయి. ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడింది. నేను పై చదువుల కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. నేనిక్కడ ఉన్నంత కాలం ఈ సేవలను కొనసాగిస్తా. విదేశానికి వెళ్లేముందు ఈ ఎన్జీవో బాధ్యతలను నా స్నేహితులకు అప్పగిస్తా. అక్కడ నుంచి కూడా నేనేం చేయగలనా అన్నది ఆలోచిస్తా’ అని చెబుతోంది అన్వి.