ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగుల కడపుమంటల్లో కేసీఆర్ కాలిపోయే రోజులు వచ్చాయని విమర్శించారు. నోటిఫికేషన్ ఒక బూటకమని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇదో కొత్త నాటకానికి తెరతీశారని అన్నారు. దుబ్బాక ,జీహెచ్‌ఎంసీ దెబ్బతో దొరకి 6 ఏళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు.
కాలం చెల్లింది..
నిరుద్యోగుల కాళ్లుకడిగి నెత్తిన పోసుకున్నా క్షమించరని, మాయ మాటలు విని మోసపోయే రోజులకు కాలం చెల్లిందని దుయ్యబట్టారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారుకు ఉన్న గీరలు ఊడిపొక తప్పదన్నారు. ముఖ్యమంత్రి మాటలను సీరియస్‌గా తీసుకోవడం జనాలు ఎప్పుడో మానేశారని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగుల తడాఖా..
కేసీఆర్ నోటిఫికేషన్ అనగానే సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం అన్నంత జోక్‌గా నిరుద్యోగులు పరిగణిస్తున్నారని అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిరుద్యోగుల సమస్యలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే అన్నీ శాఖాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుల తడకగా నోటిఫికేషన్ ఇచ్చి కోర్టుల ద్వారా రద్దు చేసి.. చేతులు దులుపుకోవాలని చేస్తే నిరుద్యోగుల తడాఖా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: పోలీసు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశం