Bandi Sanjay on Gudatipally Protestమహిళలు, బాలికలు అని చూడకుండా గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గౌరవెల్లి భూ నిర్వాసితులు, సర్పంచ్‌లను వెంటతీసుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.
Bandi Sanjay meets governor tamilisai : గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు కాకుండా నిర్వాసితుల రక్తాన్ని ప్రవహించజేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని.. కానీ నిర్వాసితులకు న్యాయంగా రావాల్సిన పరిహారం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. కొంత మంది యువకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు తలలు పగులగొట్టారని ఆరోపించారు.
gouravelli oustees protest : రాష్ట్రంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు బండి సంజయ్ తెలిపారు. బిల్లులు రాకపోవడంతో కొందరు ప్రజాప్రతినిధులు భిక్షమెత్తుకుంటున్నారని వాపోయారు. మరికొందరు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తమిళిసైకి చెప్పామని వెల్లడించారు.
మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు బండి సంజయ్ వెల్లడించారు. కనీస వసతులు, సరైన భోజన సదుపాయం లేక 6వేల మంది విద్యార్థులు అవస్థలు పడుతోంటే కేసీఆర్ సర్కార్‌కు ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి విద్యార్థులంతా రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'తెలంగాణలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అవస్థల గురించి గవర్నర్‌ను కలిసి విన్నవించాం. సర్పంచ్‌లకు అధికారాలు ఇస్తామని తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కొత్త చట్టం తీసుకొచ్చి నిధులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతోంది. సర్పంచ్‌లు కూలీ పనులు చేసుకుంటున్నారు. అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకూ నిధులు ఇవ్వడం లేదు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం లేదు. సర్పంచుల హక్కులు కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది.' -- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు