కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కొవిడ్ విలయంతో భయానక పరిస్థితులు నెలకొన్నా... ముఖ్యమంత్రి కనీసం సమీక్ష కూడా చేయటం లేదన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు, మరణాలు తగ్గించి చూపిస్తున్నారని ఆరోపించారు. అందువల్లనే ప్రజలు కూడా కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు.
అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్ టీకా తీసుకున్నారా.. అని ప్రశ్నించిన సంజయ్.. వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు సీఎం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ప్రధానికి పేరొస్తుందనే ఉద్దేశంతో కనీసం వ్యాక్సినేషన్ వేయించలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 80 శాతం ప్రజలకు ఉచితంగా టీకా వేస్తామని కేంద్రం చెప్పిందన్న సంజయ్.. మళ్లీ టీకాకు రూ.2,500 కోట్లు ఎందుకు కేటాయించారో చెప్పలని డిమాండ్ చేశారు. టీకా పేరుతో దోచుకునేందుకే తెరాస ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలుచేయాలని డిమాండ్ చేశారు. పీఎం కేర్ నిధులు గురించి తాము పూర్తి నివేదిక ఇచ్చామని.. సీఎం సహాయనిధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమమార్గాల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్న తెరాసకు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఇవీచూడండి: అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్