Bandi Sanjay Comments: కరోనాను ఎదుర్కోవడంలో భారతదేశాన్ని ప్రథమస్థానంలో నిలిపిన ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్ జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. నిన్నటి(జనవరి 17) వరకే 158 కోట్ల డోసులు పూర్తి అయ్యాయన్న సంజయ్.. ప్రపంచంలోనే ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకున్నా కరోనాను విజయవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోలేదని.. తీసుకొమ్మని కూడా ప్రజలకు పిలుపునివ్వలేదని విమర్శించారు.
కమిటీల పేరుతో కాలయాపన..
317జీవో వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవోను సవరించే వరకు కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మద్దతుగా జాతీయ నాయకులతో వర్చువల్ వేదికగా సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కమిటీల పేరుతో కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చలేక కేంద్రంపై నింద వేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా ముందుకు వెళ్తున్నామని సంజయ్ పేర్కొన్నారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త నాటకాలు..
"ప్రపంచంలోనే ప్రతి రోజు 43లక్షల వ్యాక్సినేషన్ వేస్తున్న ఏకైక దేశం భారత్. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ పెడితే ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడొద్దని పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. సీఎం కేసీఆర్ ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోలేదు. కరోనా మొదటి వేవ్‌లో కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారు. 9 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో 317జీవో పైన చర్చించకపోవడం దుర్మార్గం. ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ సంక్రాంతి పండగ చేసుకుంటే.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రగతిభవన్‌ను ముట్టడించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు భాజపా అండగా ఉంటుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మద్ధతుగా జాతీయ నాయకులతో వర్చువల్ వేదికగా సభ నిర్వహిస్తాం. పాఠశాలల్లో సిబ్బంది, మౌలిక సదుపాయాలే లేవు.. ఇంగ్లీష్ మాధ్యమం ఎలా అమలు చేస్తారు. ఏడేళ్లలో ఒక్క పాఠశాలనైనా కేసీఆర్ సందర్శించారా..? 317జీవో నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తల్చుకుంటే గతంలో ప్రభుత్వాలే పోయాయి. బిస్వాల్ కమిటీ లక్షా 91వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పితే ఎందుకు భర్తీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్.. ఇవ్వలేక కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారు."
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: