హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. కరోనా నిబంధనల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతితక్కువ మంది ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే హాజరయ్యారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా మరికొందరు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర కేబినెట్ పునర్విభజన నేపథ్యంలో కేంద్రం.. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. హరియాణా గవర్నర్ సత్యదేవ్ ఆర్యా.. త్రిపురకు బదిలీ కాగా ఆయన స్థానంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమితులయ్యారు. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
1980లో తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యదర్శిగా మొదలైన దత్తాత్రేయ(Bandaru Dattatreya) ప్రస్థానం.. ఆ తర్వాత ఏళ్లలో.. పలుమార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా గెలిచేలా సాగింది. 2019లో కేంద్రం.. ఆయణ్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో.. దత్తాత్రేయ(Bandaru Dattatreya) హరియాణా గవర్నర్‌గా బదిలీ అయ్యారు.