Plastic Ban: పర్యావరణానికి హాని కలిగించే ఒకసారి వాడిపారేసే పల్చటి ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఉత్పత్తులపై నిషేధాన్ని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) కఠినంగా అమలు చేయనుంది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ముడిసరకుల సరఫరాను, డిమాండ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం.. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం.. ప్రజలను చైతన్యపరచడం.. పట్టణ, స్థానిక సంస్థలు, జిల్లా యంత్రాంగాలకు అవగాహన కల్పించడం.. మార్గనిర్దేశం చేయడంపై పీసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.
నిషేధాన్ని సమర్థంగా అమలు చేయడానికి, ప్రత్యామ్నాయ వస్తువులను ప్రోత్సహించేందుకు కంపోస్టబుల్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వన్‌టైమ్ సర్టిఫికేట్లను జారీ చేయనుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలపై ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు పీసీబీ కార్యశాలల్ని నిర్వహిస్తుందన్నారు. నిషేధం ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ‘ఎస్‌యూ-పీసీబీ’ అనే ప్రత్యేక ఆన్‌లైన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలంతా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను వదిలేసి ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ మహమ్మారిపై విజయం సాధించగలుగుతామన్నారు.
నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులివే..
పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే పుల్లలు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్‌లు, పిప్పర్‌మెంట్లకు వాడే పుల్లలు, ఐస్‌క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మాకోల్, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్ బాక్స్‌ల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు మొదలైనవి.
ఇవీ చదవండి: