Balakrishna Birthday Celebrations: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బోర్డు సభ్యులు, సిబ్బంది, చిన్నారులతో కలిసి బాలయ్య కేక్ కట్ చేశారు. అనంతరం క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులకు కేక్ తినిపించి పుస్తకాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన ఆరోగ్య శ్రీ ఓపీడి సెంటర్‌ను బాలకృష్ణ ప్రారంభించారు.
బాలకృష్ణ జన్మదినం కావడంతో ఆసుపత్రి ప్రాంగణానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ ముందుగా తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్టీఆర్ కారణజన్ముడు అని... ఆయనే తనకు తండ్రి, గురువు, దైవంతో సమానమని బాలకృష్ణ అన్నారు. ఒకవైపు కళామతల్లి, మరోవైపు ఆసుప్రతి ద్వారా క్యాన్సర్ రోగులకు సేవ చేయడం భగవంతుడు ఇచ్చిన అదృష్టం అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అతి తక్కువ ఖర్చుతో పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవాలయం లాంటి ఈ ఆసుపత్రికి పునాది వేశారన్నారు. భూమిపై అందరు పుడుతారని, కానీ మనకంటూ ఒక ప్రత్యేక స్థానంతో ప్రజల హృదయాల్లో నిలిపోవడం అనేది ఆనందంగా ఉందన్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎన్టీఆర్ మానసపుత్రిక అని అభివర్ణించారు. దాతల సహాయంతోనే ఈ ఆసుపత్రి నడుస్తోందని... రోగులకు తగిన విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పడకలు ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రిలో పడకలు పెంచేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. వైద్యులు, వెద్యేతర సిబ్బందితో పాటు పలువురు కృషి వలన క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎందరో దాతల విరాళాలతో క్యాన్సర్ రోగులకు మంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. యువత దేశానికి భవిష్యత్ అని... ఇలాంటి దాతలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలతోపాటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు బ్రాహ్మాణి, భరత్, దేవాంశ్, ఇతర బోర్డు సభ్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:'ఆడవాళ్లకి కష్టమొస్తే చూస్తూ ఊరుకోలేను.. ఆ బాధ్యత ప్రభుత్వానిదే'