ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ నియామకమయ్యారు. బాజిరెడ్డిని ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేబినెట్ విస్తరణ సమయంలో బాజిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని భావించినా.... అనివార్య కారణాల వల్ల ఆయనకు అమాత్య పదవి దక్కలేదు. అయితే.. ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తానని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని సమాచారం.
ఇందులో భాగంగా రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా ముందుగా బాజిరెడ్డి గోవర్దన్‌ను నియమిస్తారని చర్చ జరిగినా.. చివరకు ఆ పదవి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి దక్కింది. రెండో సారి కూడా భంగపడ్డ గోవర్దన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పదవే కట్టబెట్టారు. టీఎస్ ఆర్టీసీకి ఛైర్మన్‌గా నియమిస్తూ బాధ్యతలు అప్పజెప్పారు.
మరోవైపు.. టీఎస్ఆర్టీసీకి ఎండీని నియమించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. అయితే... ఐపీఎస్‌ను.. నియమించాలా లేదా ఐఏఎస్‌ను నియమించాలనే దానిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీగా ఐఏఎస్ అధికారి సునీల్‌శర్మ కొనసాగుతున్నారు.