ఏపీ విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ వసతి గృహాల్లో 94 మందికి కరోనా సోకింది. మిగతా విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బయటపడిన పాజిటివ్ కేసుల్లో ఎవ్వరికి తీవ్ర లక్షణాలు లేవని ఆర్డీవో కిశోర్ తెలిపారు. వైరస్ సోకిన వారికి ఇంజినీరింగ్ బాయ్స్ హాస్టల్లో క్వారంటైన్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు ఏయూ అధికారులు స్పష్టం చేశారు.
ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఏయూ అధికారులు తెలిపారు. కొవిడ్ సోకిన విద్యార్థులకు మంచి ఆహారం అందిస్తూ.. 24గంటలు వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందిచామన్నారు. క్యాంపస్‌లోని ఆర్ట్స్, సైన్స్, లా, పరిశోధక విద్యార్థులు ఉండే హాస్టల్స్ అన్నింటినీ మూసివేయటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఏయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేసినట్టు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇకపై అన్నీ ఆన్లైన్ తరగతులే జరుగుతాయని వెల్లడించింది.
ఇదీ చదవండి: భక్తుల కొంగుబంగారం... వెంకటాపురం లక్ష్మీనరసింహుడు..