పాకిస్థాన్‌లోని అఫ్గానిస్థాన్ రాయబారి కూతురిపై దుండగులు దాడి చేశారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ నగరం నడిబొడ్డులో యువతిని అపహరించి కొన్ని గంటల పాటు తీవ్రంగా హింసించారు. ఈ విషయాన్ని ఇరు దేశాల అధికారులు ధ్రువీకరించారు.
రాయబారి కూతురు సిల్లిలా అలిఖిలా(26)పై శుక్రవారం దాడి జరగ్గా.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో సత్వరం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది అఫ్గాన్ విదేశాంగ శాఖ. యువతిని తీవ్రంగా హింసించారని పేర్కొంది. ఆమె తలకు తీవ్ర గాయాలైనట్లు, మణికట్టు, కాళ్లపై తాడు గుర్తులు ఉన్నాయని, తీవ్రంగా కొట్టినట్లు ఆసుపత్రి నివేదికలో ఉందని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ తెలిపింది. కొన్ని ఎముకలు సైతం విరిగినట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొంది.
యువతిని సుమారు 5 గంటల పాటు తమ అధీనంలో ఉంచుకొని దాడి చేసినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అనంతరం ఆమెను పోలీసులు.. ఇస్లామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నాయి. అయితే.. ఆమె అపహరణ, విడుదల చేసిన సందర్భాలపై ఎలాంటి విషయాలు తెలియదని తెలిపాయి.
అయితే ఈ దాడితో తీవ్రంగా కలత చెందినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్‌లోని అఫ్గాన్ రాయబారి నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
పాక్ రాయబారికి సమన్లు..
ఈ దాడిని తీవ్రంగా ఖండించాల్సిన, నీచమైన చర్యగా అభివర్ణంచింది అఫ్గాన్ విదేశాంగ శాఖ. పాక్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్తలు, వారి కుటుంబాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గాన్‌లోని పాకిస్థాన్ రాయబారి మాన్సూర్ అహ్మద్ ఖాన్‌కి సమన్లు జారీ చేసింది. అఫ్గాన్ రాయబారి కూతురి అపహరణ, దాడిపై నిరసన వ్యక్తం చేసింది.
ఇరుపక్షాల ఆరోపణలు..
ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. అఫ్గాన్‌లో దాడులు చేసేందుకు పాకిస్థాన్ వేలాది మంది జిహాదీలను పంపుతోందని, తాలిబన్లకు పాక్ సురక్షితమైన ప్రదేశమని ఆరోపించింది. మరోవైపు.. పాక్ వ్యతిరేక తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్, బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీలకు కాబుల్ స్థావరంగా మారిందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది.
ఇదీ చూడండి: సీఎం రేసులో ఆ 9 మంది- అవకాశం ఎవరికి?