Attack on VH House: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఇంటి ముందు ఉన్న కారును గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అక్కడున్న సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించారు. ఇందులో ఓ దుండగుడు.. నెమ్మెదిగా వచ్చి వీహెచ్ కారు వద్ద నిలబడ్డాడు. ఎవరు రాకపోవటాన్ని చూసి.. వెంట తెచ్చుకున్న పరికరంతో కారు అద్దలు పగలగొట్టి.. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీకెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ దృశ్యాలు ఆధారంగా చేసుకుని దుండగున్ని గుర్తించేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
నాకు రక్షణ లేదా..? మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తనకు రక్షణ లేదా అని వీహెచ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేదా అని నిలదీశారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానన్నారు. గతంలోనూ బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి విన్నవించినా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
ఊరుకునేది లేదు..: మాజీ ఎంపీ వీఎచ్ ఇంటిపై జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వీహెచ్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. దోషులను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ప్రజల మనిషి అయన వీహెచ్ లాంటి వ్యక్తి ఇంటిపై దాడి చేయటమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలన్నారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
ఇవీ చూడండి: