Atmakuru Villagers protest: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మకూరు గ్రామస్థులు ధర్నా చేపట్టారు. ఆత్మకూరులో గతేడాది పుట్టా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రూ.50 కోట్ల మేర చిట్టీల డబ్బులతో పరారయ్యాడు. ఈ ఘటనపై గతంలో వెంకటేశ్వరరావుపై పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో జులైలో వెంకటేశ్వరరావు గ్రామంలోకి వచ్చాడు. తమ డబ్బులు ఇవ్వాలని నిలదీయగా.. నెల రోజులు సమయం ఇవ్వాలని కోరాడు.
ఆగస్టు 15తో వెంకటేశ్వరరావుకు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో గ్రామస్థులు ఆతడిని నిలదీశారు. అదే సమయంలో వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తిరగబడటంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బాధితులు.. వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించడంతో అతడి కొడుకును వదిలిపెట్టారు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు బాధితులపైనే తిరిగి కేసులు పెడతారా అంటూ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని సీఐ భూషణం వివరణ ఇచ్చారు.
ఇవీ చదవండి: