Assembly sessions: శాసనసభ, మండలి సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయసభల సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ ఎనిమిదో సెషన్‌కు సంబంధించి మూడో సమావేశం ప్రారంభం కానుంది. మండలి 18వ సెషన్‌కు సంబంధించిన మూడో సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ ప్రాంగణంలో, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమావేశాల పనిదినాలు, ఎజెండా రేపు ఖరారు కానుంది.
రెండు సభల సభావ్యవహారాల సలహాసంఘం కమిటీలు రేపు సమావేశమై పనిదినాలతో పాటు చర్చించే అంశాలను ఖరారు చేస్తాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలు, అధిక వర్షాల కారణంగా జరిగిన నష్టం, పోడు భూముల అంశం, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, తదితర అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది.
రేపు ఉభయసభల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో ఆదివారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంయుక్తంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉందని పోచారం పేర్కొన్నారు. సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని అన్నారు. స్పీకర్, సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని కోరిన ఆయన.. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందించాలన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని.. ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు.
ప్రొటోకాల్ తప్పనిసరి..: ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని.. శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం తరఫున అందించాలని పోచారం పేర్కొన్నారు. అసెంబ్లీ డిస్పెన్సరీలో కరోనా టెస్టింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయటంతో పాటు.. అవసరమైన సభ్యులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అసెంబ్లీ, మండలి పరిసరాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కీలక ప్రకటనలకు అవకాశం..: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలు, ఇటీవల వరదలపై సభలో చర్చ జరిగే అవకాశముంది. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చించి తేదీలు ఖరారు చేశారు.
ఇవీ చదవండి: